Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ గెలిచింది.. ఐతే..?

By:  Tupaki Desk   |   19 Jun 2017 10:46 AM GMT
పాకిస్థాన్ గెలిచింది.. ఐతే..?
X
మొన్న భారత్-బంగ్లాదేశ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ కు ముందు బంగ్లా అభిమానులు తయారు చేసిన ఒక ఫొటోషాప్ పిక్ ఇంటర్నెట్ లో వైరల్ అయింది. అందులో పులి ఓ కుక్కను వేటాడుతున్నట్లు చూపించి.. అందులో పులికి బంగ్లాదేశ్ జెండాను.. కుక్కకు ఇండియా జెండాను అంటించారు. ఇది బంగ్లాదేశ్ అభిమానుల దిగజారుడుతనాన్ని సూచించింది. కొందరు భారత అభిమానులు దీనిపై మండిపడ్డా.. చాలామంది లైట్ తీసుకున్నారు. ఇలాంటి స్థాయి తక్కువ అభిమానులు అన్ని చోట్లా ఉంటారు కాబట్టి అలాంటి సిల్లీ థింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు.

ఐతే అభిమానుల సంగతలా వదిలేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న ప్రొఫెషనల్ ఆటగాళ్ల నుంచి కొంచెం హుందాతనాన్ని కోరుకుంటారు ఎవరైనా. గెలిచినపుడు విర్రవీగడం.. ఓడినపుడు కుంగిపోవడం.. ఎలాంటి సందర్భంలోనైనా నోరు జారి మాట్లాడటం ఆటగాళ్లకు తగని పని. ఐతే నిన్నటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరే.. వాళ్ల ప్రొఫెషనలిజం మీద సందేహాలు రేకెత్తించింది. లేక లేక మ్యాచ్ గెలిచేస్తుండటంతో పాకిస్థాన్ ఆటగాళ్లు అదుపు తప్పిపోయారు. భారత ఆటగాళ్లు ఔటైనపుడు సంబరాలు మరీ శ్రుతి మించాయి. అలాగే విజయం ఖరారైపోయిన దశలో ఆటగాళ్లు స్టాండ్స్ లో ఉన్న తమ అభిమానుల వైపు చూసి ఇంకా రెచ్చిపోండన్నట్లు సైగలు చేయడం.. విచిత్ర విన్యాసాలు చేయడం.. బహుమతి ప్రదానోత్సవ సమయంలోనూ కొంచెం హద్దులు దాటి ప్రవర్తించడం భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. భారత అభిమానుల సంగతలా వదిలేస్తే మ్యాచ్ చూసిన మిగతా దేశాల ప్రేక్షకులకు పాకిస్థాన్ ఆటగాళ్ల తీరు ఎబ్బెట్టుగా అనిపించింది. వాళ్ల స్థాయి ఏంటో అందరికీ అర్థమైంది.

ఏదో అదృష్టం కలిసొచ్చి పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో భారీ స్కోరు చేయగలిగింది. సెంచరీ కొట్టిన ఫఖర్ జమాన్ కేవలం 3 పరుగులకే వెనుదిరగాల్సిన వాడు.. బుమ్రా నోబాల్ వేయబట్టి బతికిపోయాడు. ఆ ఉత్సాహంలో ధాటిగా ఆడాడు. జట్టు భారీ స్కోరు చేయడానికి గట్టి పునాది వేశాడు. భారత్ టాస్ గెలవగానే బౌలింగ్ ఎంచుకోవడం.. ఉమేశ్ యాదవ్ ను కాకుండా స్పిన్నర్ అశ్విన్ నే తుది జట్టులోకి తీసుకోవడం వంటి నిర్ణయాలు చేటు చేశాయి. పాకిస్థాన్ కు అవి బాగా కలిసొచ్చాయి. అసలే భారీ లక్ష్యం.. పైగా మహ్మద్ ఆమిర్ అద్భుతమైన స్పెల్ తో భారత్ ను ఆరంభంలోనే దెబ్బ కొట్టడంతో భారత్ విజయాకాశాలు సన్నగిల్లాయి. ఐతే ఆటలో గెలుపోటములు సహజం. ఎలాంటి జట్టుకైనా ఓటమి సహజం. తనదైన రోజు ఎలాంటి జట్టయినా గెలవగలదు. కొన్ని సార్లు ఫేవరెట్ అయిన జట్టు కూడా కాలం కలిసి రాకపోతే ఓడుతుంది. నిన్నటి రోజున భారత్‌ కు ఏదీ కలిసి రాలేదు. అన్నీ ప్రతికూలమయ్యాయి. అందుకే ఓటమి తప్పలేదు. పాక్ కు అన్నీ కలిసొచ్చాయి. గెలిచేసింది. అంతమాత్రాన తమకు తిరుగులేదన్నట్లు విర్రవీగడమే అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

ఇప్పుడిలా విర్రవీగుతున్న జట్టు.. గత దశాబ్ద కాలంగా ఏం జరుగుతోందో చరిత్ర తిరగేసుకుంటే మంచిది. ఎక్కడ ఏ టోర్నీలో పాకిస్థాన్ ఎదురైనా భారత్‌ దే విజయం. ఛాంపియన్స్ ట్రోఫీల్లో రెండు మ్యాచ్ లు మినహాయిస్తే ఐసీసీ టోర్నీలు వేటిలోనూ ఇండియాను పాకిస్థాన్ ఓడించిన చరిత్ర లేదు. వన్డే ప్రపంచకప్ లో ఆరుసార్లు.. టీ20 ప్రపంచకప్ లో ఐదుసార్లు పాక్ ను ఓడించిన ఘన చరిత్ర భారత్ ది. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా 2-2తో రికార్డు సమానం. మొన్న టోర్నీ ఆరంభ మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఎంత చిత్తుగా ఓడించారో తెలిసిందే. కానీ ఏ సందర్భంలోనూ భారత ఆటగాళ్లు విర్రవీగిపోలేదు. అభిమానులు కూడా శ్రుతి మించిపోలేదు.

ఫైనల్లో భారత్ గెలిచి ఉన్నా.. కోహ్లీసేన హుందాగానే ఉండేదనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఫైనల్లో ఓడాక కూడా కోహ్లి కానీ.. ఇతర ఆటగాళ్లేమీ నోరు జారలేదు. ఓటమికి సాకులు వెతకలేదు. ప్రత్యర్థి గొప్పగా ఆడిందని కితాబిచ్చారు. వాళ్లకివ్వాల్సిన క్రెడిట్ వాళ్లకిచ్చారు. ఒక్కసారి ఇండియా గెలిచి ఉంటే పాక్ పరిస్థితి ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. పాకిస్థాన్లో ఎన్ని టీవీ సెట్లు పగిలి ఉండేవో. జట్టులో ఎన్ని తలకాయలు లేచి ఉండేవో. పాకిస్థాన్ జట్టులో ఏ ఒక్కరైనా నేరుగా తమ దేశానికి వెళ్లగలిగి ఉండేవారా? అక్కడా ఇక్కడా తలదాచుకుని వేర్వేరుగా ఒక్కొక్కరు ఆలస్యంగా తమ దేశానికి వెళ్లాల్సి వచ్చేది. అదీ వాళ్ల పరిస్థితి. పాక్ అభిమానుల తీరు అలా ఉంటుంది మరి. కనీసం ఆటగాళ్లుగా వీళ్లయినా ప్రొఫెషనలిజాన్ని చాటుకుని.. కొంచెం హుందాగా ప్రవర్తిస్తే.. అభిమానుల్లోనూ మార్పు వస్తుంది. అలా కాకుండా మైదానంలో గల్లీ క్రికెటర్లలా ప్రవర్తిస్తే అభిమానుల తీరూ అలాగే ఉంటుంది. యథా ఆటగాళ్లు తథా అభిమానులు అన్నట్లు తయారవుతుంది.

కొసమెరుపు: ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ పోరులో పాకిస్థాన్ ను ఇండియా చిత్తుగా ఓడించాక వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో సరదాగా ఒక మెసేజ్ పెట్టాడు. బాగా ఆడారూ పిల్లలూ.. కానీ నాన్న నాన్నే కదా అంటూ పాకిస్థాన్ కు ఇండియా నాన్న అన్న ఉద్దేశం వచ్చేలా ఒక ట్వీట్ పెట్టాడు. వీరూ ఏదో సరదాకి ఆ వ్యాఖ్య చేస్తే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ దీనిపై స్పందిస్తూ 15 నిమిషాల వీడియో రిలీజ్ చేశాడు. అందులో దారుణమైన బూతులు వాడాడు. ఇండియాలో చారిత్రక కట్టడాలన్నీ తామే కట్టించామని.. తమ దయ వల్లే ఇండియా ఇలా ఉందని.. ఇలా రకరకాల చీప్ కామెంట్స్ చేశాడు. ఇక పాకిస్థాన్ ఫైనల్ చేరిన అనంతరం ఆ దేశ మాజీ ఓపెనర్ అమీర్ సోహైల్.. తమ జట్టు ఫిక్సింగ్ చేసి ఫైనల్ చేరిందన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశాడు. మన మాజీ ఆటగాళ్లెవరి నుంచైనా ఇలాంటి వ్యాఖ్యలు మనం వింటామా? దీన్ని బట్టే పాకిస్థాన్ క్రికెట్లో అవ్యవస్థ.. ఆ దేశ ఆటగాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఆటగాళ్ల వారసత్వాన్ని అందుకుని ఆడుతున్న ఇప్పటి ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏముంది?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/