Begin typing your search above and press return to search.

మొనగాడు రిటైరైపోయాడు

By:  Tupaki Desk   |   20 Feb 2017 11:01 AM GMT
మొనగాడు రిటైరైపోయాడు
X
క్రికెట్ అంటేనే ఉర్రూతలూగించే ఆట.. ఆ ఆటను మరింత ఉర్రూతలూగించే బ్యాట్సుమన్లు కొద్ది మందే. బంతి కనిపిస్తే చాలు చుక్కలు చూపించే అలాంటి ఆటగాళ్లంటే జాతీయాభిమానాలు పక్కన పెట్టి మరీ అభిమానులు విజిళ్లేస్తారు. సెహ్వాగ్.. గేల్.. వంటివాళ్లంతా అదే కోవకు చెందిన ఆటగాళ్లు. వాళ్లు మన దేశంపై ఆడినప్పుడు తప్ప ఇంకెవరితో ఆడినా ఆ ఆటను ఎంజాయ్ చేస్తారు అన్ని దేశాల అభిమానులు. ఆ లిస్టులో పాకిస్ఠానీ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ కూడా ఒకరు. అప్రిదీ క్రీజ్ లోకి వస్తే మైదానంలోని ఫీల్డర్లే కాదు గ్యాలరీల్లోని ప్రేక్షకులు కూడా క్యాచులు పట్టడానికి రెడీ అయిపోతారు. ఆట పరంగా అఫ్రిదీ అంటే మన బౌలర్లకు - అభిమానులకు శత్రువే. అలాంటి అఫ్రిదీ ఆటను ఇక క్రికెట్ ప్రేమికులు చూసే ఛాన్సు లేదు. ఈ పించ్ హిట్టర్ తాజాగా పూర్తి రిటైర్మెంటు ప్రకటించేశాడు.

అఫ్రిదీ తన 21 ఏళ్ల కెరీర్‌ కు ముగింపు ప‌లుకుతూ ఆదివారం రాత్రి రిటైర్మెట్ ప్ర‌క‌టించాడు. ఇప్ప‌టికే టెస్టులు - వ‌న్డేల నుంచి త‌ప్పుకున్న అఫ్రిది.. 2016లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ కు పాక్ కెప్టెన్‌ గా వ్య‌వ‌హ‌రించాడు. అయితే టోర్నీలో పాక్ విఫ‌ల‌మ‌వ‌డంతో కెప్టెన్‌ గా త‌ప్పుకున్న అఫ్రిది.. ఆట‌గాడిగా కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టంచేశాడు. అయినప్పటికీ, అతనిని టీ20 జట్టులోకి ఎంపిక చేయకుండా పాక్ క్రికెట్ బోర్డు అవమానించింది. ఈ నేపథ్యంలోనే, అఫ్రిదీ తన కెరీర్ కు ముగింపు పలికాడు.

1996లో శ్రీలంకపై కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి సంచలనం సృష్టించిన అఫ్రిదీ ఆ తరువాత చాలాకాలం అదే జోరు కొనసాగించాడు. అఫ్రిదీ రికార్డు బద్దలు కావడానికి 17 ఏళ్లు పట్టింది.

అయితే, బ్యాట్ తో తుపాను సృష్టించే అఫ్రిదీ బంతితో మాత్రం అందుకు భిన్నంగా స్లో బౌలింగ్ చేసేవాడు. అయితే.. తన లెగ్ స్పిన్ మాయాజాలంతో వికెట్లు గిరాటేయడంలో మాత్రం ఈయన టాలెంట్ మామూలిది కాదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో టాప్ టెన్ ఆల్ రౌండర్లలో ఆయనా ఒకడిగా నిలిచాడు.

తన సుదీర్ఘ కెరీర్ లో అఫ్రిది ఆడిన మొత్తం టెస్టులు 27 మాత్రమే. పాకిస్థాన్ లో అశాంతి వాతావరణం కారణంగా ఆ దేశంతో సిరీస్ లు నిర్వహించడం తగ్గిపోవడంతో ఎక్కువ మ్యాచులు ఆడే అవకాశం రాలేదు. టెస్టుల్లో 1176 పరుగులు చేసిన అఫ్రిది అత్యధిక స్కోరు 156. అంతేకాదు 48 వికెట్లు కూడా తీశాడు. వన్డేల విషయానికి వస్తే మొత్తం 398 వన్డేలు ఆడిన అఫ్రిదీ 8064 పరుగులు చేశాడు. టాప్ స్కోర్ 124 రన్స్. అంతేకాదు, 395 వికెట్లు కూడా తీసి సత్తా చాటాడు. టీ20ల్లో 98 మ్యాచ్ లు ఆడిన అఫ్రిదీ 1405 పరుగులు చేసి, 97 వికెట్లు తీశాడు.

ఇండియాపై ప్రేమ.. స్వదేశంలో ఇబ్బందులు

గత ఏడాది కోల్ కతాలో ఆడిన ఓ మ్యాచ్ తరువాత అఫ్రిదీ చేసిన కామెంటు ఆయన్ను తెగ ఇబ్బంది పెట్టింది. తన సుదీర్ఘ కెరీర్లో ఇండియాలో దొరికినంత ప్రేమాభిమానాలు తనకు ఎక్కడా దొరకలేదని.. చివరకు సొంత దేశం పాకిస్థాన్ లో కూడా అభిమానులు తనకు ఇంత సంతోషాన్నివ్వలేదని అన్నాడు. క్రికిట్ ను ఇంతగా అభిమానించే భారతీయులు గొప్పవారని.. వారికి తాను రుణ పడి ఉంటానని అన్నాడు. దీంతో పాక్ లో ఆయనపై అంతా విరుచుకుపడ్డారు. మాజీ ఆటగాళ్లు, ప్రజలే కాదు.. చివరకు పాక్ ఉన్నత స్థాయి కోర్టులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చాయి.

టెస్టుల్లో అఫ్రిదీ రికార్డులు అదరహో..

* 18 సంవత్సరాల 333 రోజుల వయసులోనే అఫ్రిదీ తన తొలి టెస్టు సెంచరీ చేశాడు. టెస్టు సెంచరీ చేసిన చిన్న వయస్కుల్లో ఆయన స్థానం 7.

* 2004లో బెంగళూరులో అఫ్రిదీ ఇండియాపై 26 బంతుల్లోనే అర్ధ శతకం కొట్టేశాడు. వరల్డ్ క్రికెట్లో ఇది రెండో ఫాస్టెస్ట్ హాప్ సెంచరీ.

* 2005లో ఇండియాపై లాహోర్ లో జరిగిన టెస్టులో హర్భజన్ బౌలింగ్ లో ఒకే ఓవర్లో 27 పరుగులు తీశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో రెండో అత్యధిక పరుగులు ఇవే.

* అదే మ్యాచ్ లో ఆయన హర్భజన్ బౌలింగులోనే వరుసగా నాలుగు సిక్సులు బాదేశాడు. టెస్టుల్లో ఒకే ఓవర్లో ఇన్ని వరుస సిక్సులు ఎవరూ కొట్టలేదు.

వన్టేల్లో పట్టపగ్గాల్లేవ్..

* 1996లో శ్రీలంకపై 37 బంతుల్లో సెంచరీ చేశాడు. అప్పటికి అదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఆ తరువాత 17 ఏళ్లకు ఆండర్సన్ 36 బంతుల్లో, డివిలియర్స్ 31 బంతుల్లో సెంచరీలు చేయడంతో అఫ్రిదీది థర్డ్ ఫాస్టెస్ట్ సెంచరీగా మిగిలింది.

* వన్డేల్లో సెంచరీ చేసిన అత్యంత చిన్నోడు అఫ్రిదీనే. శ్రీలంకపై ఆయన ఫాస్టెస్ట్ సెంచరీ చేసినప్పుడు ఆయన వయసు 16 ఏళ్ల 217 రోజులు.

* 2014 ఆసియా కప్ లో బంగ్లాదేశ్ పై 18 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తరువాత ఈ రికార్డు బ్రేక్ కావడంతో ఇది సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీగా ఉంది.

* వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదింది అఫ్రిదీయే. అతని కెరీర్లో మొత్తంగా 351 సిక్సులు కొట్టాడు. ఇంకెవరూ ఆయన దరిదాపుల్లో లేరు. 270 సిక్సులతో జయసూర్య రెండో ప్లేసులో ఉన్నాడు.

* ఇంటర్నేషనల్ వన్డే కెరీర్లో ఆయన 6862 బంతులు ఎదుర్కొని 351 సిక్సులు కొట్టడంతో ప్రతి 19.79 బంతులకు యావరేజిన ఒక సిక్సు కొట్టినట్లు. ఇంకెవరూ ఆయన దరిదాపుల్లో లేరు.

* 2013లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో 158 మీటర్ల దూరం వెళ్లేలా సిక్సు కొట్టాడు. క్రికెట్ చరిత్రలో ఇదే లాంగెస్ట్ సిక్స్.

* పాకిస్థానీ క్రికెటర్లలో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ల రికార్డు అఫ్రిదీదే. వన్డేల్లో మొత్తం 32 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు ఆయన సొంతం.

* గేల్ - సెహ్వాగ్ - గిల్ క్రిస్ట్ - డివిలియర్స్ వంటి భయంకరమైన హిట్టర్లు ఎందరున్నా కూడా హయ్యెస్ట్ స్ర్టయిక్ రేటు మాత్రం అఫ్రిదీదే. ఆయన స్ర్టయిక్ రేట్ 116.86

* వెస్టిండీస్ పై ఆయన ఓసారి 12 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడంతో అది హయ్యస్ట్ వికెట్ టేకింగ్ లో ఆరో రికార్డు.

* ఒక వరల్డ్ కప్ లో కెప్టెన్ హోదాలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనతా అఫ్రిదీదే. 2011 వరల్డ్ కప్ లో అఫ్రిదీ 22 వికెట్లు తీసి ఈ రికార్డు సాధించాడు.

* వన్డేల్లో 8 వేల పరుగులు, 350 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్ అఫ్రిదీ.

* ఒకే మ్యాచ్ లో 50 పరుగులు, 5 వికెట్లు మూడు సార్లు తీసిన ఏకైక క్రికెటర్.

* అత్యధిక వన్డేలాడిన పాక్ క్రికెటర్

20-20ల్లో..

* 1000 పరుగులు, 50 వికెట్లు ఉన్న ఏకైక క్రికెటర్

* టీ20లో థర్డ్ హయ్యెస్ట్ వికెట్ టేకర్

* టీ20 వరల్డ్ కప్ లలో ఎక్కువ వికెట్లు తీసిన ఘనత ఆయనదే. వేర్వేరు టీ20 వరల్డ్ కప్ లలో మొత్తం 41 వికెట్లు తీశాడు.

* టీ20ల్లో హయ్యెస్ట్ ఇన్నింగ్స్ స్ట్రయిక్ రేట్లలో మొదటి మూడు స్థానాలూ ఆయనవే. 357.14... 280.. 260 స్ట్రయిక్ రేట్లతో తొలి మూడు స్థానాల్లో అఫ్రిదేయే ఉన్నాడు.

అన్ని ఫార్మాట్లలో..

* క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 400 సిక్సులు దాటిన మొనగాడు అఫ్రిదీ ఒక్కడే.

* 10 వేల పరుగులు, 500 వికెట్లు ఉన్న రెండో క్రికెటర్. ఏకైక పాకిస్థానీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/