Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ అంటే ప్ర‌త్య‌క్ష న‌ర‌కం..ఉజ్మా ఉద్వేగం

By:  Tupaki Desk   |   25 May 2017 4:17 PM GMT
పాకిస్తాన్ అంటే ప్ర‌త్య‌క్ష న‌ర‌కం..ఉజ్మా ఉద్వేగం
X
ప్రేమ పేరుతో పాకిస్థాన్ యువకుడి చేతిలో మోసపోయి..అక్కడే చిక్కుకుపోయి చిత్రహింసలు ఎదుర్కున్న భారత యువతి ఉజ్మా అహ్మద్ క్షేమంగా తిరిగివచ్చారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రత్యేక శ్రద్ధ, విదేశాంగ శాఖ అధికారుల ప్రత్యేక చొరవతో ఆమె వాఘా దగ్గర భారత్-పాక్ బార్డర్ దాటి వచ్చారు. స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చిన సంద‌ర్భంగా కేంద్ర‌మంత్రి సుష్మాస్వ‌రాజ్‌ తో క‌లిసి మీడియాతో ఉజ్మా ఉద్వేగంగా ప్ర‌సంగించారు. నరకం అంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్ లో ప్రత్యక్షంగా చూశానన్నారు. తనను తౌహీర్ తీసుకెళ్లిన ప్రదేశం తాలిబన్ ఆధీనంలో ఉందని, తాను క్షేమంగా తిరిగి వస్తానని అనుకోలేదన్నారు. బార్డర్ దాటితే పరిస్థితుల్లో ఇంతగా మార్పు ఉంటుందనుకోలేదని ఉజ్మా ఆవేదన వ్యక్తం చేశారు.

తాను క్షేమంగా తిరిగి వచ్చేందుకు కారణమైన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కు, భారత అధికారులకు ఉజ్మా కృతజ్ఞతలు తెలిపారు. తొలిసారి త‌న జీవితం ఎంత విలువైనదో తెలిసి వ‌చ్చిందని ఉజ్మా పేర్కొంది. ``పాకిస్థాన్‌ లో అడుగుపెట్టడం తేలికే.. కానీ రావడమే కష్టం. అదొక మృత్యుకుహరం. పరస్పర అంగీకారంతో వివాహాలు చేసుకున్న మహిళలు కూడా అక్కడ తీవ్ర రోదన అనుభవిస్తున్నారు’ అని ఉజ్మా చెప్పింది. ఉజ్మా అహ్మద్ క్షేమంగా తిరిగి వచ్చేందుకు భారత అధికారులతో పాటు, పాకిస్థాన్ హోంశాఖ, విదేశాంగ శాఖ అధికారులు కూడా సాయం చేశారని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఇస్లామాబాద్ కోర్టులో ఉజ్మా తరుపున వాదించిన లాయర్ సొంత తండ్రిలా బాధ్యత తీసుకొని కేసు గెలిచారని, ఆయనకు కేంద్ర‌మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉజ్మాను భారత పుత్రికగా సుష్మ అభివర్ణించారు.

పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి తౌహిర్ అలీ అనే వ్యక్తితో ఉజ్మా అహ్మద్ కు మలేషియాలో పరిచయమైంది. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో ఈ నెల 3న ఉజ్మా పాకిస్థాన్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత గన్ తో బెదిరించిన తౌహీర్ ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ఆమె ఎటూ వెళ్లకుండా బంధించాడు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టాడు. ఉజ్మా భారత ఎంబసీ అధికారులను ఆశ్రయించి సాయం చేయాలని కోరింది. ఇస్లామాబాద్ కోర్టులో వాదనలు వినిపించిన భారత్.. కేసు గెలిచింది. దీంతో ఆమెను ప్రత్యేక వాహనంలో భారత-పాకిస్థాన్ బార్డర్ వాఘాలో దించారు. భారత భూభాగంలోకి ప్రవేశించగానే ఉద్వేగానికి లోనయ్యారు ఉజ్మా అహ్మద్. తొలి అడుగు వేయడానికి ముందు భూమిని ముద్దాడారు. అనంతరం కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వాఘా బార్డర్ లో ఉజ్మా అహ్మద్ కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఢిల్లీకి చేరుకున్న ఆమె విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిశారు. అక్కడ సుష్మా స్వరాజ్ ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. సుష్మా స్వరాజ్ ను కలిసిన తర్వాత ఉజ్మా అహ్మద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/