Begin typing your search above and press return to search.

మ‌న‌మ్మాయికి న్యాయం చేసిన పాక్ కోర్టు

By:  Tupaki Desk   |   24 May 2017 8:42 AM GMT
మ‌న‌మ్మాయికి న్యాయం చేసిన పాక్ కోర్టు
X
ఒక అమాయ‌కురాలికి న్యాయం చేసే విష‌యంలో పాక్ లోని ఒక కోర్టు తీర్పు ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. పెళ్లి పేరుతో మోస‌పోయిన మ‌న‌మ్మాయి పాక్‌కు వెళ్లి పోరాడ‌టం.. ఈ ఇష్యూలో పాక్ కోర్టులో ఆమెకు న్యాయం జ‌రిగిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. పాక్‌లోని ఇస్లామాబాద్ హైకోర్టులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఏంటంటే...
ఢిల్లీకి చెందిన ఉజ్మా... తాహిర్ అలీ మ‌లేసియాలో క‌లుసుకున్నారు. అది ప్రేమ‌గా మారి అత‌డ్ని పెళ్లి చేసుకునేందుకు పాక్‌కు వెళ్లింది. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత కానీ ఆమెకు తాను మోస‌పోయిన విష‌యం అర్థం కాలేదు. తాహిర్‌కు అప్ప‌టికే పెళ్లి అయి.. న‌లుగురు పిల్ల‌లు ఉన్నారు. ఆ విష‌యం త‌న‌కు చెప్ప‌లేదు స‌రిక‌దా.. త‌న‌ను బెదిరించి మ‌రీ బ‌ల‌వంతంగా పెళ్లి చేసుకున్న విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

త‌న పాస్ పోర్టును.. ప్ర‌యాణ ప‌త్రాల్ని దొంగ‌లించిన తాహిర్ మీద కేసు పెట్టేందుకు పాక్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని ఆశ్ర‌యించింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి.. చేసిన మోసాన్ని అక్క‌డి మీడియా ముందు బ‌య‌ట‌పెట్టింది. అనంత‌రం త‌న‌ను భార‌త్‌కు భ‌ద్ర‌త‌తో పంపేందుకు వీలుగా అనుమ‌తి ఇవ్వాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

ఈ ఉదంతంపై కోర్టులో విచార‌ణ జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తాహిర్ కోర్టుకు వ‌చ్చి ఉజ్మాను క‌లుసుకోవాల‌ని కోరారు. అయితే.. ఆమె మాత్రం క‌లుసుకునేందుకు నిరాక‌రించారు. దీంతో ఆమె ఇష్టం లేకుండా తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వ‌మ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అనంత‌రం ఆమెకు సంబంధించిన పాస్ పోర్టు.. ప్ర‌యాణ ప‌త్రాల్ని తాహిర్ కోర్టుకు స‌మ‌ర్పించాడు. ఉజ్మాను ప్రైవేటుగా క‌లుసుకోవాల‌ని కోరిన‌ప్ప‌టికీ.. అందుకు ఆమె ఒప్పుకోక‌పోవ‌టంతో ఆమెను క‌లుసుకునే అవ‌కాశం లేద‌ని ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి తేల్చి చెప్ప‌ట‌మే కాదు.. భార‌త స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ ఆమెకు భ‌ద్ర‌త క‌ల్పిస్తూ ర‌క్ష‌ణ‌గా ఉండాల‌ని పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది.
వాఘా స‌రిహ‌ద్దుల వ‌ర‌కూ ఆమెకు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని.. ఆమె ర‌క్ష‌ణ బాధ్య‌త‌లు చూడాల‌ని కోర్టు పేర్కొంది. విచార‌ణ సంద‌ర్భంగా ఉజ్మా స్పృహ త‌ప్పి ప‌డిపోవ‌టంతో ఆమెకు అవ‌స‌ర‌మైన వైద్య సాయాన్ని కోర్టు అందించింది. మ‌న‌మ్మాయికి జ‌రిగిన అన్యాయాన్ని గుర్తించ‌ట‌మే కాదు.. ఆమెకు న్యాయం జ‌రిగేలా చూసే ప్ర‌య‌త్నం పాక్ కోర్టులో జ‌ర‌గ‌టంపై ప‌లువురు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.