Begin typing your search above and press return to search.

యుద్ధంలో ఓడిపోతానంటూనే ఇమ్రాన్ దగుల్బాజీ మాటలు

By:  Tupaki Desk   |   15 Sep 2019 10:41 AM GMT
యుద్ధంలో ఓడిపోతానంటూనే ఇమ్రాన్ దగుల్బాజీ మాటలు
X
ఓడిపోయినా ఫర్లేదు.. ప్రత్యర్థిని వీలైనంత నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన కొన్ని దేశాలకే ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తుంది పాకిస్తాన్. దాదాపు 70 ఏళ్ల క్రితం దేశంలో భాగమైన పాక్.. విడిపోయినప్పటికీ తన ద్వేషాన్ని మాత్రం విడవలేకపోయింది. సహజవనరులతో అలరారే పాక్ పూర్తిగా పక్కదారి పట్టి ఉగ్రవాదులు.. సైన్యం కబంధ హస్తాల్లో చిక్కుకొని కిందామీదా పడుతోంది.

తిండి కూడా లేని ఇబ్బందికర పరిస్థితి ఇప్పుడు పాక్ లో నెలకొంది. పెట్రోల్ కంటే పాల ధర అధికంగా ఉన్న ఆ దేశంలో.. భావోద్వేగాలతో ప్రజల్నిరెచ్చగొట్టి యుద్ధం దిశగా అడుగులు వేయాలన్న దుర్మార్గపు ఎత్తుగడను వేస్తున్నారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. యుద్ధమంటూ వస్తే భారత్ చేతిలో ఓటమి తప్పదని చెబుతూనే.. అణ్వస్త్ర బూచిని చూపించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అల్ జజీరా మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు.

సాధారణ యుద్ధంలో ఓడినా అణు యుద్ధాన్ని కొట్టిపారేయలేమన్న ఇమ్రాన్.. సంప్రదాయ యుద్ధంలో పాక్ ఓడిపోవచ్చు. కానీ.. రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే అది అణ్వస్త్రాలతోనే ముగుస్తుందని.. యుద్ధమే వస్తే.. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. యుద్ధం గురించి ఇన్నిమాటలు చెబుతూనే.. తాను యుద్ధానికి వ్యతిరేకమని.. తాను కోరుకోవటం లేదంటూ చిలకపలుకులు వల్లించారు.

ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పాక్ ను గట్టెక్కిస్తానని.. కశ్మీర్ అంశంలో అంతర్జాతీయ మెరుగుదలకు ప్రయత్నిస్తానని చెప్పిన ఇమ్రాన్.. కశ్మీర్ అంశంలో తమకు అంతర్జాతీయ మద్దతు కొరవడిందన్న చేదు నిజాన్ని అంగీకరించారు. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తప్పించుకోవటానికి వీలుగా.. భారత్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న ఇమ్రాన్ తీరు చూస్తే.. ఇలాంటి నాయకుల కారణంగా రెండు దేశాల మధ్య అనవసరమైన ఉద్రిక్తతలు ఎందుకు చోటు చేసుకుంటాయో ఇట్టే అర్థం కాక మానదు.