Begin typing your search above and press return to search.

`పాకిస్థాన్ ఓ వెన్నుపోటు దేశం`

By:  Tupaki Desk   |   26 July 2017 10:33 AM GMT
`పాకిస్థాన్ ఓ వెన్నుపోటు దేశం`
X
కొంద‌రు కొంద‌ర్ని కొంత కాలం పాటు మాత్ర‌మే మోసం చేయ‌వ‌చ్చు త‌ప్ప అంద‌ర్నీ అన్ని సంద‌ర్భాల్లోనూ మాయ చేయ‌డం అయ్యేప‌నికాదు. ఈ విష‌యం మ‌నుషులకు వ‌ర్తించినట్లే అంత‌ర్జాతీయ సంబంధాల విష‌యంలో దేశాల‌కు సైతం వ‌ర్తిస్తుంది. ఇది స‌రిగ్గా మ‌న దాయాది పాకిస్థాన్‌ కు సెట్ అయ్యేలాగా ఉంది. ఉగ్ర‌వాదుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ గా ఉన్న పాకిస్థాన్ అంత‌ర్జాతీయంగా చుల‌కన అవుతోంది. పాకిస్థాన్‌ కు ఇవ్వాల్సిన 35 కోట్ల డాల‌ర్ల సాయాన్ని అమెరికా ర‌క్ష‌ణ మంత్రి జేమ్స్ మాటిస్ నిలిపివేయ‌డం అమెరికా కాంగ్రెస్ స‌భ్యుడు టెడ్ పో తాజాగా కామెంట్లు దీనికి నిద‌ర్శ‌నం. అమెరికా ర‌క్ష‌ణ మంత్రి చ‌ర్య‌ను అభినందించిన టెడ్ పో...పాకిస్థాన్ ఓ వెన్నుపోటు దేశం అని మండిప‌డ్డారు.

ఉగ్ర‌వాదంపై పోరు కోసం ఈ మొత్తాన్ని అమెరికా ఇవ్వాల్సి ఉంది. అయితే పాక్ చ‌ర్య‌లు ఉగ్ర‌వాదానికి ఊతం ఇచ్చేలా ఉన్న నేప‌థ్యంలో అమెరికా ప్ర‌భుత్వం త‌న నిధుల విడుద‌ల‌ను ఆపివేసింది. ఇప్ప‌టికైనా ఈ సాయాన్ని నిలిపేయ‌డాన్ని టెడ్‌ స్వాగ‌తించారు. పాకిస్థాన్‌ పై అమెరికా అవ‌లంబిస్తున్న త‌ప్పుడు విధానాన్ని ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం స‌మీక్షించ‌డం ఆనందంగా ఉందని ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న‌లో అన్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌ను టెడ్ పో త‌న ట్విట్ట‌ర్‌ లో పోస్ట్ చేశారు. తాలిబ‌న్‌ కు చెందిన హ‌క్కానీ నెట్‌ వ‌ర్క్‌ ను అంతం చేయ‌డానికి పాకిస్థాన్ త‌గిన చర్య‌లు తీసుకోలేద‌ని చెబుతూ.. ఆ దేశానికి ఇవ్వాల్సిన సాయాన్ని నిలిపేస్తున్న‌ట్లు ఈ మ‌ధ్యే జిమ్ మాటిస్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌త్యేక నిధి పేరుతో పాకిస్థాన్‌ కు అమెరికా 90 కోట్ల డాల‌ర్లు కేటాయించింది. అందులో పాక్ ఇప్ప‌టికే 55 కోట్ల డాల‌ర్లు అందుకుంది. మిగ‌తా నిధుల విడుద‌ల విష‌యంలో పాకిస్థాన్‌ కు అమెరికా ఈ షాక్ ఇచ్చింది.