Begin typing your search above and press return to search.

మైండ్ గేమ్‌ మొదలెట్టిన పాక్

By:  Tupaki Desk   |   26 Sep 2016 11:24 AM GMT
మైండ్ గేమ్‌ మొదలెట్టిన పాక్
X
ఉరీ ఉగ్రఘటన నేపథ్యంలో భారత్.. పాక్ ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు దేశాలకు చెందిన పలువురు వార్ ఇష్యూ మీద రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీ సీరియస్ గా చర్చల మీద చర్చలు జరపటం.. త్రివిధ దళాల అధిపతులతో భేటీ కావటం ఆసక్తిని పెంచింది. యుద్ధం మీద మరిన్ని ఊహాగానాల్ని పెంచేలా చేసింది.

ఇదిలా ఉంటే.. ఎవరూ ఊహించని విధంగా కోజికోడ్ లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో మాట్లాడిన మోడీ.. పాక్ తో వార్ చేసే ఉద్దేశం తనకు లేదన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేశారు. యుద్ధం చేస్తానంటూనే.. యుద్ధం పేదరికం.. నిరుద్యోగం.. ఆర్థిక వృద్ధి అంశాల మీద ఇరు దేశాలు పోటీ పడాలంటూ ఆయన చేసిన ప్రసంగంతో యుద్ధం మీద భారత్ తొందరపడకూడదన్న భావనలో ఉన్నట్లుగా సంకేతాలు వ్యక్తమైనట్లుగా అంచనా వేస్తున్నారు. ఒకవైపు భారత ప్రధాని ఆచితూచి అడుగులు వేస్తున్న వేళ.. మరోవైపు దాయాది పాక్ మాత్రం దూకుడుగా వ్యవహరించటం గమనార్హం.

పాక్ తో యుద్ధం చేసే సాహసం భారత్ చేయలేదని.. అలా చేసిన పక్షంలో భారత్ కే ఎక్కువ నష్టమన్న వ్యాఖ్యలు చేస్తూ.. మైండ్ గేమ్ మొదలు పెట్టింది. ఇరు దేశాల మధ్య యుద్ధం కాని వస్తే భారత్ కే భారీ నష్టం వాటిల్లుతుందని..అందుకే భారత్ యుద్ధం చేసే రిస్క్ చేయదంటూ పాక్ దౌత్యవేత్తలు తాజాగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా భారత్ ఆర్థికంగా ఎంతో నష్టపోతుందని.. ఆ భారం దశాబ్దాల తరబడి ప్రజల్ని పట్టి పీడిస్తుందని.. ఆ విషయం పాలకులకు తెలుసని అందుకే యుద్ధానికి తొందరపడరన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేయాలని భారత్ భావిస్తున్నా.. అది సాధ్యం కాదని చెప్పారు. తాత్కాలికంగా భారత్ పథకం ఫలించినట్లు కనిపించినా.. పాక్ ఏకాకి కాదని.. తమకెన్నో దేశాల మద్దతు ఉందని వ్యాఖ్యానించటం చూస్తే.. యుద్ధం విషయంలోనూ.. తమకున్న మద్దతు విషయం మీద గొప్పలు చెబుతూ.. భారత్ మీద మైండ్ గేమ్ ఆడుతుందన్న భావన కలగక మానదు. యుద్ధానికి తాము తొలుత కాలుదువ్వమని చెబుతున్న దౌత్యవేత్తలు తమ పేర్లను వెల్లడించకుండా పాక్ లోని ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు.

పాక్ దౌత్యవేత్తల మాటలే నిజ‌మేన‌ని అనుకుంటే.. లాజిక్ గా చూసుకున్నా.. యుద్ధమనేది ఒకసారి వచ్చాక దాని వల్ల నష్టం రెండు దేశాలకు ఉండటం ఖాయం. అంతేకానీ.. భారత్ కు ఎక్కువ.. పాక్ కు తక్కువ అనుకోవటం ఆత్మవంచన చేసుకోవటమే. యుద్ధ భయంతో కరాచీ స్టాక్ మార్కెట్ పాతాళానికి పడిపోయిన తీరు చూస్తేనే.. ఆ దేశానికి దెబ్బన్నది ఇట్టే అర్థమవుతుంది. కానీ.. వాటిని మనసులోనే దాచుకొని భారత్ ను బ్లాక్ మొయిల్ చేసేలా వ్యాఖ్యానించటం కనిపిస్తుంది. మరి.. ఈ తరహా మాటలకు భారత పాలకులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.