మావోయిస్టుల చేతిలో పాక్ వెపన్సా?... డేంజరే గురూ

Sat Jun 15 2019 20:00:01 GMT+0530 (IST)

దేశ భద్రతకు సంబంధించి పెద్ద ఎత్తున భారత బలగాలు సరిహద్దుల వెంట రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నాయి. దేశంలోకి చొరబడి అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్న పాక్ ముష్కరులను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న భారత సైన్యానికి ఇప్పుడు వెలుగు చూసిన ఓ విషయం డేంజర్ బెల్స్ నే వినిపిస్తోందని చెప్పక తప్పదు. మన దేశంలోనూ ఉంటూ మన పాలనా వ్యవస్థలోని కొన్ని లోపాలను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదం వైపు మళ్లిన మావోయిస్టులు ఇప్పుడు పాకిస్థాన్ సైన్యంతో చేతులు కలిపారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని ముర్నార్ అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు... వారి వద్ద నుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ఆయుధాల్లో నాటో పాకిస్తాన్ ఆర్మీ ఉపయోగించే ఆధునాతనమైన హెక్లెర్ కోచ్ జీ3 రైఫిల్‌లు ఉండటం ఇప్పుడు డేంజర్ బెల్స్ ను మోగిస్తోందని చెప్పాలి.మావోయిస్టుల వద్ద పాక్ కు చెందిన ఆయుధాలు దొరికిన వైనం సైనికాధికారులను నిజంగానే ఆశ్చర్యానికి గురిచేసింది. పాక్ కు చెందిన ఈ ఆయుధాలు వీరికి ఎలా చేరాయి..? మావోస్టులు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధం ఎంటీ..? అన్న కోణాల్లో ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ సంబంధాల గుట్టును తేల్చేందుకు ఇప్పటికే దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగిపోయారు. దీనిపై ఓ వైపు దర్యాప్తు జరుగుతుండగానే... మావోయిస్టుల వద్ద పాక్ ఆయుధాలు దొరికిన వైనంపై భారత సైన్యానికి చెందిన అధికారి డీఎమ్ అవస్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

’ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో  పాక్ ఆర్మీ ఉపయోగించే జీ 3 రైఫిల్‌ను మేము స్వాధీనం చేసుకున్నాం. ఇలా మరో దేశం ఉపయోగించే ఆయుధాలను మన దేశ భూభాగంలో స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. గతంలో కూడా మావోయిస్టుల వద్ద పాక్‌కు చెందిన ఆయుధాలు లభ్యమయ్యాయి. కాని అవి ఎక్కడి నుంచి వచ్చాయో మాత్రం తెలీలేదు’ అని ఆయన పేర్కొన్నారు. 2018లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్లో మావోల నుంచి జర్మన్‌లో తయారైన రైఫిల్ అమెరికాలో తయారైన సబ్- మెషిన్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు విదేశాల్లో తయారైన టెలిస్కోప్‌లను కూడా భద్రతా బలగాలు మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్నాయి. ఈ తరహా ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మావోయిస్టుల నెట్ వర్క్ ఎలా విస్తరిస్తుందన్న అంశంపై కూపీ లాగకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టమే తప్పదన్న వాదన వినిపిస్తోంది.