Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ మహిళ నేతకు ఏంటి పరిస్థితి.?

By:  Tupaki Desk   |   21 July 2019 1:30 AM GMT
టీఆర్ ఎస్ మహిళ నేతకు ఏంటి పరిస్థితి.?
X
ఓడలు బండ్లు అయ్యాయి.. బండ్లు ఓడలయ్యాయి. తెలంగాణ రెండో ప్రభుత్వంలో మెదక్ జిల్లా నేతల పరిస్థితి మరీ తీసికట్టుగా మారింది. మొదటి ప్రభుత్వంలో మంత్రిగా చేసిన హరీష్ రావుకు ఇప్పుడు పదవి లేదు. ఇక డిప్యూటీ స్పీకర్ గా చేసిన పద్మా దేవేందర్ రెడ్డి ఏ పదవి లేక ఎమ్మెల్యేగా నిట్టూర్చుతున్నారు. మహిళా కోటాలో మంత్రి పదవి ఖాయమని భావించిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవెందర్ రెడ్డికి సామాజిక సమీకరణం దృష్ట్యా కేసీఆర్ కేబినెట్ లో చోటు కల్పించలేదు. ఇప్పుడు ఇస్తారన్న నమ్మకం కూడా పోయిందట..

ఎమ్మెల్యేగానే నియోజకవర్గానికే పరిమితమైన పద్మాదేవందర్ రెడ్డికి ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయట.. మంత్రి పదవిలో రాలేదని నిరాశలో ఉన్న పద్మాకు ఇప్పుడు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి రూపంలో మరో సమస్య వచ్చిపడిందట.. మెదక్ నియోజకవర్గానికి చెందిన సుభాష్ రెడ్డి కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు. ఈయన ప్రొటోకాల్ ప్రకారం మెదక్ జిల్లాను ఎంచుకోవడంతో ఇప్పుడు పద్మా వర్గం కక్కలేక మింగలేక ఈయన తాకిడిని తట్టుకోలేకపోతోందట.. మంత్రి పదవి వస్తుందా రాదా అన్న టెన్షన్ ఆమెను వెంటాడుతోందట..

ఇటీవలే ఎంపీపీ ఎన్నికల్లో హవేలి ఘన్ పూర్ ఎంపీగా శేరి నారాయణ రెడ్డిని ప్రతిపాదించారు శేరి సుభాష్ రెడ్డి. అయితే పద్మా మాత్రం మాణిక్ రెడ్డిని ప్రతిపాదించారు. కానీ కేసీఆర్ మాత్రం సుభాష్ రెడ్డి వర్గీయుడికే సీటు ఇవ్వడంతో పద్మా వర్గం షాక్ కు గురైందట..

మంత్రి పదవి రాలేదు.. ఎమ్మెల్యేగా కూడా పద్మాకు ప్రాధాన్యం దక్కడం లేదు. సుభాష్ రెడ్డి మెదక్ జిల్లాలో పట్టు పెంచుకోవడంతో పద్మా తన భవిష్యత్ పై ఆందోళనగా ఉన్నారట.. పద్మాను టీఆర్ఎస్ పక్కనపెడుతోందన్న సంకేతాలు ఆమె వర్గాన్ని కలవరపెడుతున్నాయట..