Begin typing your search above and press return to search.

పాదయాత్రే నాకు పెదబాలశిక్ష : జగన్

By:  Tupaki Desk   |   17 Feb 2019 2:08 PM GMT
పాదయాత్రే నాకు పెదబాలశిక్ష : జగన్
X
"పాదయాత్ర నాకు పెదబాలశిక్ష. ప్రజల జీవితాలను దగ్గరుండి చూసి దాన్ని అర్ధం చేసుకునే అవకాశం కల్పించింది నా పాదయాత్రే. నాలో వచ్చిన మార్పునకు కారణం... ప్రజల పడుతున్న కష్టాలకు అద్దం నా పాదయాత్ర" ఇవి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాటలు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీల గర్జన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దాదాపు రెండు గంటల సేపు ప్రసగించారు.

ఈ ప్రసంగాలలో తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో వివరిస్తూనే... పాదయాత్రలో తాను చూసిన, తనకు ఎదురైన అనుభవాలను సైతం సభకు వచ్చిన వారితో పంచుకున్నారు. పాదయాత్ర సమయంలో రోడ్డు పక్కన టీ దుకాణాలు నడుపుకునే వారు, కూరగాయల దుకాణాలు నిర్వహించుకునే మహిళలు, ఎండనక, వాననక రోడ్డు పక్కన చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే వారితో మాట్లాడానని అన్నారు. "చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కనీసం గుర్తింపు కార్డులు కూడా లేవు. వారికి రుణాలు ఇచ్చేందుకు ఏ బ్యాంకులు ముందుకు రావు. మేం అధికారంలోకి రాగానే ఇలాంటి చిన్న వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందిస్తాం" అని హామీ ఇచ్చారు.

ఆనాడు తన తండ్రి పాదయాత్రలో ఆయనకు ఎదురైన అన్ని అనుభవాలను తనతో పంచుకున్నారని, ఆయన అనుభవాలను తాను పాదయాత్ర చేసినప్పుడు తనకు కూడా ఎదురయ్యాయని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కొన్ని కులాలను బీసీ జాబితాలోంచి తీసివేశారని, తాము అధికారంలోకి వస్తే 32 కులాలను బీసీల జాబితాలోకి తీసుకువస్తామని చెప్పారు. తమ పార్టీ బీసీలను వాడుకుని అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ కాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలకు చేతనైనంత సాయం చేయాలనుకుంటున్నామని అన్నారు. ప్రతీ కులానికి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తాము ప్రకటించిన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరువయ్యేలా చేస్తామని ప్రకటించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్ధానం దక్కుతుందని, ఆ స్ధానాన్ని బీసీ నాయకుడు జంగా క్రిష్ణమూర్తికి ఇస్తున్నామని ప్రకటించి తన ప్రసంగాన్ని ముగించారు జగన్మోహన్ రెడ్డి.