Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ కు భారీ ఆధిక్యం!..మోదీ వేగుల లెక్క ఇదే!

By:  Tupaki Desk   |   12 Jan 2019 8:06 AM GMT
జ‌గ‌న్‌ కు భారీ ఆధిక్యం!..మోదీ వేగుల లెక్క ఇదే!
X
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట 14 నెల‌ల పాటు రాష్ట్రమంతా సుడిగాలి ప‌ర్య‌టన సాగించిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... త్వ‌ర‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుస్ప‌ష్ట మెజారిటీతో విజ‌యం సాధించే దిశ‌గా త‌న అవ‌కాశాల‌ను మ‌రింత‌గా మెరుగు చేసుకున్నారు. ఈ మాట వైసీపీ వ‌ర్గాలో - ఏపీకి చెందిన మ‌రో పార్టీనో చెప్పిన మాట కాదు. సాక్షాత్తు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆదేశాల‌తో రంగంలోకి దిగిన సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ చెబుతున్న మాట‌. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే జ‌గ‌న్‌ కు త‌ప్ప‌క విజ‌యం వ‌రిస్తుంద‌ని జాతీయ స‌ర్వే సంస్థ‌ల‌న్నీ చెప్పినా... చివ‌రాఖరులో టీడీపీ అధినేత ప్ర‌క‌టించిన రైతు రుణ మాఫీ - డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ త‌దిత‌రాలు ఫ‌లితాలు తారుమ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యమే ల‌క్ష్యంగా జ‌గ‌న్ సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు. 14 నెల‌ల పాటు 3,648 కిలో మీట‌ర్ల మేర న‌డిచిన జ‌గ‌న్‌... మొన్న శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాద‌యాత్ర‌ను ముగించి ఎన్నిక‌ల స‌మ‌ర శంఖాన్ని పూరించిన సంగ‌తి తెలిసిందే.

దేశంలోనే సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టిన నేత‌గా జ‌గ‌న్ స‌రికొత్త సృష్టిస్తున్న నేప‌థ్యంలో జ‌గ‌న్ పాద‌యాత్ర ముగుస్తున్న స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ ఏపీ ప‌రిస్థితిపై దృష్టి సారించారు. ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి పోటీ చేసిన బీజేపీ... ఈ ద‌ఫా ఒంట‌రిగానే బ‌రిలోకి దిగ‌నుంది. ఏపీలో బీజేపీకి పెద్ద‌గా ఓట్లు వ‌చ్చే ప‌రిస్థితి ఏమీ లేకున్నా... ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచే పార్టీతో మోదీకి చాలానే అవ‌స‌రం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్డీఏకు ఎడ్జ్ ల‌భించినా... మెజారిటీకి ఇంకో 15 సీట్ల దాకా త‌క్కువ ప‌డుతుంద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. దీంతో ఎన్డీఏలో భాగ‌స్వాములు కాకుండా... యూపీఏలోనూ భాగ‌స్వాములుగా లేని పార్టీల‌పై మోదీ దృష్టి సారించారు. ఈ క్ర‌మంలోనే త‌న ఇంటెలిజెన్స్ వర్గాల‌తో ఆయ‌న ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌లు ఎలాంటి ఫ‌లితాలు ఇవ్వ‌బోతున్నాయి? జ‌గ‌న్ ప్ర‌భావం ఏ మేర ఉంటుంది? గెలుపు అవ‌కాశాలు జ‌గ‌న్ కే ఉన్నాయ‌న్న స‌ర్వేలు చెబుతున్నా.. అస‌లు జ‌గ‌న్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంద‌న్న విష‌యంపై స‌మ‌గ్ర స‌ర్వే కావాల‌ని అడిగార‌ట‌. దీంతో వెంట‌నే రంగంలోకి దిగిపోయిన నిఘా వ‌ర్గాలు... ఏపీలో విస్తృతంగా జ‌నాభిప్రాయాన్ని సేక‌రించార‌ట‌. దీని ఆధారంగా ఓ నివేదిక‌ను రూపొందించిన నిఘా వ‌ర్గాలు... దానిని జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసిన రోజే... మోదీకి అందించార‌ట‌.

ఈ నివేదిక‌లోని అంశాలేమ‌న్న విష‌యానికి వ‌స్తే... వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ క్లియ‌ర్ మెజారిటీతో విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని, వైఎస్ జ‌గ‌న్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని కూడా తేలింద‌ట‌. రాష్ట్రంలో అధికారం చేప‌ట్ట‌నున్న వైసీపీ... లోక్ స‌భ ఎన్నిక‌ల్లోనూ రాష్ట్రంలో మొత్తం 25 సీట్లు ఉంటే... వాటిలో 15- 20 సీట్ల‌ను గెలుచుకుంటుందంది నిఘా వ‌ర్గాలు నిర్ధారించిన‌ట్లుగా స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌న‌కు అవ‌స‌ర‌మైన మెజారిటీ రాని ప‌క్షంలో ఈ మేర ఎంపీ సీట్లు రానున్న వైసీపీని త‌న దారికి తెచ్చుకునే విష‌యంలో ఎలా వ్యూహాలు అమ‌లు చేయాల‌న్న దిశ‌గా ఇప్ప‌టికే మోదీ క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టిన‌ట్లుగా స‌మాచారం. అస‌లు ఏం చేస్తే జ‌గ‌న్ పార్టీ మ‌ద్ద‌తును పొంద‌వ‌చ్చ‌న్న విష‌యంపైనా దిశ‌గానూ మోదీ దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని క్లియ‌ర్‌గా చెప్ప‌డంతో పాటుగా అప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేక హోదాపై సంక‌తం చేస్తామ‌న్న పార్టీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌నున్న‌ట్లు జ‌గ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రి ఈ విష‌యంపైనా మోదీ దృష్టికి వెళ్లిందో, లేదో చూడాలి. మొత్తంగా మోదీ చేయించిన ఇంటెలిజెన్స్ స‌ర్వేలోనూ జ‌గ‌న్‌నే విజ‌యం వ‌రించ‌నుంద‌న్న విష‌యం తేలడం ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసింది.