Begin typing your search above and press return to search.

హోదా ఇష్యూ.. జగన్ కు బీజేపీ హెచ్చరిక

By:  Tupaki Desk   |   18 July 2019 9:38 AM GMT
హోదా ఇష్యూ.. జగన్ కు బీజేపీ హెచ్చరిక
X
ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా ముందుకెళ్తున్న ఏపీ సీఎం జగన్ కు బీజేపీ జలక్ ఇచ్చింది. హోదా ఇచ్చేది లేదని.. ప్యాకేజీ ద్వారా నిధులిస్తామని మరోసారి కుండబద్దలు కొట్టింది. చంద్రబాబు లాగానే హోదాపై వివాదం చేస్తే మీకే నష్టమంటూ జగన్ కు హెచ్చరికలు పంపింది. దీనిపై ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

చంద్రబాబు బాటలో నడవద్దని.. ఆయనలా హోదా గురించి నానా యాగీ చేయవద్దని ఏపీ సీఎం జగన్ ను హెచ్చరించారు బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఇన్ చార్జి దగ్గుబాటి పురందేశ్వరి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో బీజేపీ సభ్యత్వ నమోదు సభలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని.. దానికి బదులు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకోవాలని సూచించారు. ప్యాకేజీ ద్వారా నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని.. హోదాను పక్కనపెట్టి వాటిని తీసుకోవాలని జగన్ కు సూచించారు పురంధేశ్వరి.

చంద్రబాబు సైతం మొదట్లో ప్యాకేజీకి ఓకే అని ఆ తరువాత రాజకీయ ప్రయోజనం కోసం బీజేపీని అభాసుపాలు చేశారని.. జగన్ కూడా ఇప్పుడు హోదా కోసం ఆయన బాటలోనే నడుస్తూ పెద్ద తప్పు చేస్తున్నారని పురంధేశ్వరి హెచ్చరించారు.

ఇక కృష్ణా, గోదావరి జలాల పంపకాల్లో గతంలోనే ఆంధ్రా, తెలంగాణల వాటా తేలిపోయిందని.. మళ్లీ ఈ ఆంశంపై కేసీఆర్ తో జగన్ లాలూచీ పడాల్సిన అవసరం లేదని పురంధేశ్వరీ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వలే జగన్ కూడా ప్రజలను మభ్యపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెలికితీయాలని జగన్ ను డిమాండ్ చేశారు.