Begin typing your search above and press return to search.

మోడీ స్టాండ్ కు ఇంత క్రేజా.. కోట్లు రాబట్టేస్తున్నాయ్!

By:  Tupaki Desk   |   18 Sep 2019 5:49 AM GMT
మోడీ స్టాండ్ కు ఇంత క్రేజా.. కోట్లు రాబట్టేస్తున్నాయ్!
X
ప్రధాని మోడీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పుకోదగ్గ విజయాలు లేకున్నా.. అంతకంతకూ పెరిగిపోతున్న పాపులార్టీ మోడీకి మాత్రమే సాధ్యమేమో? ఆయన స్టార్ట్ చేసిన స్వచ్ఛ భారత్ కారణంగా ఖర్చు చేసిన నిధులకు.. ఆ పేరుతో దేశ ప్రజల నుంచి వసూలు చేసిన సెస్ కు.. దేశ రూపురేఖల్లో వచ్చిన మార్పును ఒక్కసారి మదింపు చేస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే.. ఇలాంటి మాటలు మోడీని అభిమానించే వారికి అస్సలు నచ్చవు.

మోడీ మీద ఉన్న ద్వేషభావంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారంటారు. అంతదాకా ఎందుకు? విభజన నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి రాజకీయ కారణంతో ఇప్పటివరకూ ఎలాంటి మేలు చేయనప్పటికీ.. ఆంధ్రాప్రాంతానికి చెందిన వారు మోడీ మీద ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయకపోగా.. ఆయన మీద విమర్శలు చేస్తే ఖండించేస్తుంటారు. ఇలా తానేమీ చేయకున్నా ప్రజల్లో విపరీతమైన పాపులార్టీని.. సానుకూలతను సంపాదించుకున్న ప్రధాని మోడీనే అవుతారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగిన రచ్చ ఎంతన్న విషయాన్ని ఆర్థికవేత్తలు తరచూ ప్రస్తావించినా.. ఆ సందర్భంగా తమ డబ్బును తాము తెచ్చుకోవటం కోసం సగటు జీవి గంటల కొద్దీ సమయాన్ని ఏటీఎం కౌంటర్ల వద్ద వెయిట్ చేయాల్సి వచ్చినా.. దాన్ని దేశభక్తిలో భాగమని ఫీల్ కావటమే కాదు.. మోడీ తమకు మేలు చేస్తారన్న నమ్మకాన్ని ప్రదర్శించారు. తీరా చూస్తే.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టిన దాని కంటే దారునమన్న విషయాన్ని పలువురు ఆధారాలతో చెప్పినా.. ప్రజలు పట్టించుకున్నది లేదు.

ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ జమానాలో దేశానికి ఒరిగిందేమీ లేదన్న మాట పలు వర్గాల ప్రముఖల నోట వినిపిస్తున్నా.. అందుకు భిన్నమైన క్రేజ్ ఆయన సొంతం. తాజాగా ఆయన తనకు వచ్చిన బహుమతుల్ని ఆన్ లైన్ వేలం వేసే పని చేయటం తెలిసిందే. వివిధ సందర్భాల్లో తనకు వచ్చిన బహుమతుల్ని ఆయన వేలం వేస్తున్నారు. అలా వచ్చిన నిధుల్ని నమామి గంగే ప్రాజెక్టు కోసం వినియోగించాలని నిర్ణయించారు. తాజాగా జరిగిన వేలంలో రూ.500 విలువైన ఫోటో స్టాండ్ కు ఏకంగా కోటి ధర పలికింది. ఒక రూ.18వేలు విలువ చేసే కలశానికి సైతం ఏకంగా కోటికి పైనే ధర పలకటం చూస్తే.. మోడీకి ఉన్న ఇంతటి క్రేజ్ సమీప భవిష్యత్తులో మరే ప్రధానికి రాదేమోనన్న భావన కలగటం ఖాయం. మోడీనా మజాకానా?