Begin typing your search above and press return to search.

సీఎం రాజీనామా చేస్తే కంగ్రాట్స్ చెప్పిన మోడీ

By:  Tupaki Desk   |   27 July 2017 4:15 AM GMT
సీఎం రాజీనామా చేస్తే కంగ్రాట్స్ చెప్పిన మోడీ
X
నిజ‌మే.. ఒక ముఖ్య‌మంత్రి త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే మోడీ ట్విట్ట‌ర్ ఖాతాలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కంగ్రాట్స్ చెప్ప‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. సాధార‌ణంగా ఏదైనా విజ‌యాన్ని సాధించిన‌ప్పుడు చెప్పే కంగ్రాట్స్ ను మోడీ.. ఒక సీఎం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే చెప్ప‌టం విశేషంగానే చెప్పాలి. ఈ ఆస‌క్తిక‌ర ఉదంతం బుధ‌వారం చోటు చేసుకుంది.

ప‌ద‌విని పోగొట్టుకున్న ఏ ముఖ్య‌మంత్రికి ఏ ప్ర‌ధాన‌మంత్రి పెట్ట‌ని రీతిలో కంగ్రాట్స్ అన్న ట్వీట్ చేయ‌టం చూసిన‌ప్పుడు.. మోడీ లోని అస‌లుసిస‌లు రాజ‌కీయ నేత క‌నిపిస్తాడ‌ని చెప్పాలి. నిజానికి ఇలాంటి ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో అభినంద‌న‌లు తెల‌ప‌టం అస్స‌లు సాధ్య‌మే కాదు. కానీ.. బుధ‌వారం మాత్రం అలాంటి ఉదంతం చోటు చేసుకుంది.

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన వెంట‌నే ప్ర‌ధాని మోడీ అభినంద‌లు తెల‌ప‌టం ప‌లువురి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షించింది. సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న ప్ర‌క‌ట‌న వెలువ‌డిన కొద్ది నిమిషాల వ్య‌వ‌ధిలోనే మోడీ ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ త‌ర‌హా అభినంద వెలువ‌డ‌టం చూస్తే.. మోడీ మార్క్ వ్యూహం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.

ఇంత‌కూ మోడీ కంగ్రాట్స్ తోనే స‌రి పెట్ట‌లేదు స‌రిక‌దా మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్ చేశారు. అవినీతిపై కంగ్రాట్స్ తో స‌రి పెట్ట‌ని మోడీ.. స‌ద‌రు నితీశ్‌ను మ‌రింత‌గా పొగిడేస్తూ.. "అవినీతిపై పోరాటంలో చేరినందుకు శుభాభినంద‌న‌లు నితీశ్ కుమార్ జీ. 125 కోట్ల మంది ప్ర‌జ‌లు మీ నిజాయితీని స్వాగ‌తిస్తున్నారు. మీకు మ‌ద్ద‌తిస్తున్నారు. దేశ ఉజ్వ‌ల భ‌విత‌కు మ‌రీ ముఖ్యంగా బిహార్ అభివృద్ధి కోసం రాజ‌కీయ విభేదాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన‌.. అవినీతిపై పోరాటంలో చేతులు క‌ల‌పాల్సిన త‌రుణ‌మిది. దేశం కూడా ఇదే కోరుకుంటోంది" అని పేర్కొన్నారు.

మోడీ లాంటి నేత ఈ త‌ర‌హా ట్వీట్ పెట్ట‌టం వెనుక ఆస‌క్తిక‌ర వ్యూహం ఉంద‌నేది స్ప‌ష్టం. సీఎంగా నితీశ్ రాజీనామా చేసిన‌ప్ప‌టికి.. ఆయ‌న అధికారానికి దూరం కాలేద‌నే చెప్పాలి. ఇంకా చెప్ప‌లంటే ప‌వ‌ర్ కు మ‌రింత చేరువ కావ‌ట‌మే కాదు.. మ‌రికొంత కాలం ఆయ‌న త‌న పద‌విని పొడిగించుకున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అదెలానంటే.. పీక‌ల్లోతు అవినీతి ఆరోప‌ణల్లోకి మునిగిపోవ‌టం ద్వారా ఆర్జేడి అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అండ్ కో వేస్తున్న‌వేషాల‌కు ఏం చెప్ప‌లేని ప‌రిస్థితుల్లో ఉన్న వేళ‌.. ఆప‌న్న హ‌స్తం అందిస్తామ‌న్న హామీని నితీశ్‌ కు మోడీ అండ్ కోకు ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇవాళ రాజీనామా చేసినా.. రోజుల వ్య‌వ‌ధిలోనే బీజేపీ సాయంతో నితీశ్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని ముందుకు రావ‌టం.. అందుకు బీజేపీ ప‌రివారం ఓకే చెప్ప‌టం ఖాయం.

అదే జ‌రిగితే.. లాలూ స్థానంలో బీజేపీ నేతృత్వంలో సంకీర్ణ ప్ర‌భుత్వానికి నితీశ్ సార‌థి అవుతారు. ఇదంతా అధికారం కోసం ప‌న్నిన వ్యూహంగా ప్ర‌జ‌లు భావించే బ‌దులు.. నితీశ్ లోని నిజాయితీని అభినందించ‌టం ద్వారా.. ఆయ‌న్ను హీరోగా తెర మీద‌కు తెచ్చార‌ని చెప్పాలి.

ఒక మంచి వ్య‌క్తి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు లొంగిపోకుండా.. అవినీతిని ఎంత‌మాత్రం స‌హించ‌లేని వ్య‌క్తిగా అభివ‌ర్ణించ‌టం ద్వారా.. అలాంటి మంచి వ్య‌క్తితో రాజ‌కీయ బేధాభిప్రాయాల‌కు అతీతంగా మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌న్న సందేశాన్ని రేపొద్దున సంకీర్ణ ప్ర‌భుత్వానికి ప్ర‌క‌టించిన వెంట‌నే చేసేందుకు ఛాన్స్ ఉంది. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయేది అదే కావ‌టంతో.. మోడీ ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా నితీశ్ ఇమేజ్ ను భారీగా పెంచేలా ట్వీట్ చేయ‌ట‌మే కాదు.. త‌న స్నేహ హ‌స్తాన్ని ట్వీట్ రూపంలో చాటార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.