Begin typing your search above and press return to search.

అసలే నేతలు.. వాతలు పెట్టుకుంటారా?

By:  Tupaki Desk   |   11 Aug 2017 5:04 AM GMT
అసలే నేతలు.. వాతలు పెట్టుకుంటారా?
X
అసలే వాళ్లు రాజకీయ నేతలు.. తమకు తాము వాతలు పెట్టుకోవడానికి వారు సిద్ధంగా ఉంటారా? రాజకీయ నాయకుల మీద నియంత్రణ విధించే ఎలాంటి నిబంధనను అయినా.. రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం పేరిట.. చట్టసభ సభ్యుల ఎదుటకే పంపితే.. అసలు ఈ దేశంలో ఎన్నటికైనా సరైన చట్టాలు రూపొందుతాయా? రాజకీయ నాయకులనే ట్యాగ్ లైన్ తగిలించుకున్న వారి మీద నియంత్రణ దండం అనేది ఎప్పటికైనా సాధ్యమవుతుందా? అనే సందేహాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ నాయకులు నేరాలకు పాల్పడినందుకు ఒకసారి వాళ్లకు శిక్ష పడితే గనుక.. వారిని జీవితకాలం పాటూ మళ్లీ ఎన్నికల్లో పోటీచేయకుండా ఉండేలా కొత్త చట్టాలను తీసుకురావాలంటూ.. సుప్రీం ధర్మాసనం ఎదుట ఓ వ్యాజ్యం నడుస్తోంది. అయితే ఈ విషయంలో సుప్రీం ధర్మాసనం ఎటూ నిర్ణయం తీసుకోకపోగా, ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి నివేదిస్తే ఎలా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడం అంటే అది మళ్లీ పార్లమెంటులోనే ఓటింగుకు వస్తుంది. పార్లమెంటులో సగానికి మించిన సభ్యులు ఓటు వేస్తే దీనికి సరిపోదు. మూడింట రెండొంతుల మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తే తప్ప.. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చదు. అసలు పార్లమెంటు సభ్యుల్లోనే రకరకాల నేరారోపణలు - నేరాభియోగాలు ఉన్నవారు అనేక మంది అధికారం చెలాయిస్తున్న ఈ రోజుల్లో... జీవితకాలం పాటూ ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించే బిల్లు సభ ముందుకు వస్తే.. దాని పరిస్థితి ఎలా ఉంటుందో పసిపిల్లలైనా ఊహించగలరు!

అసలే ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందు విచారణకు వచ్చిన వ్యాజ్యంలో ... అయిదేళ్లకు మించిన శిక్ష పడే నేర అభియోగాలు విచారణ ఎదుర్కొంటున్న వారిని కూడా.. ఎన్నికల నుంచి నిషేధించాలనే డిమాండ్ ఉంది. ఇది కొంచెం ప్రాక్టికల్ గా సాధ్యం కాని డిమాండ్ కూడా! ఎందుకంటే.. ప్రతి ఒక్కరూ తమ రాజకీయ ప్రత్యర్థుల మీద తీవ్రమైన నేరాభియోగాలు మోపేయడం ఒక రివాజుగా మారుతుంది. ఆ సంగతి అటుంచితే.. నాయకుల్ని ఎన్నికల నుంచి నిషేధించే బిల్లు ఏ రూపంలో రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్లినా.. అది అసలు గట్టెక్కుతుందా అనేది జనంలో ఉండే సందేహం.