సుప్రీం మాజీ జడ్జీ కలకలం..మోడీ హత్య ఉత్తదే

Wed Jun 13 2018 14:08:28 GMT+0530 (IST)

మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మోడీని తుదముట్టించేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారంటూ ఇటీవల వెలువడిన లేఖ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని భీమా-కొరెగాంలో జనవరి 1న జరిగిన హింసకు సంబంధించి పోలీసులు ఇటీవల దళిత నేత సుధీర్ ధార్వాలే - న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ - మహేశ్ రౌత్ - షోమా సేన్ - రోనా విల్సన్ అనే ఐదుగురు వ్యక్తులను నాగ్ పూర్ - ముంబయి - ఢిల్లీలో అరెస్ట్ చేశారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరైన రోనా విల్సన్ అనే వ్యక్తి నివాసంలో లభించిన లేఖలో ఈ కుట్ర విషయం ఉందని ఆ ఐదుగురినీ పుణె కోర్టులో హాజరుపర్చిన సమయంలో మహారాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల పవార్ తెలిపారు.ఈ కుట్రపై వివిధ పార్టీలో అనుమానాలు వ్యక్తం చేయగా తాజాగాఈ ఎపిసోడ్ పై సుప్రీం - హైకోర్టు మాజీ న్యాయమూర్తులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రధాని మోడీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారనే లేఖ నకిలీదని - అది ప్రచార స్టంటు అంటూ పలువురు సుప్రీం - హైకోర్టు మాజీ న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి  - ఎల్గార్ పరిషత్ నిర్వాహకులు పిబి సావంత్ తాజాగా స్పందిస్తూ నకిలీదని వ్యాఖ్యానించారు. తాను ఆ లేఖను స్వయంగా చూడకపోయినా - మీడియాలో వచ్చిన వార్తలను బట్టి అది నకిలీదని స్పష్టంగా తెలుస్తున్నదని సావంత్ అన్నారు. పూణె పోలీసుల తరఫున కోర్టుకు హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గతవారం ఆ లేఖను చదివి వినిపించారు. 'నేను ఆ లేఖను చూడలేదు. మీడియాలో వచ్చిన వార్తలను బట్టి చూస్తే అది నకిలీదేనని స్పష్టమవుతోంది. ఈ లేఖపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలి' అని సావంత్ డిమాండ్ చేశారు. మరోవైపు ఆ లేఖ ఒక పబ్లిసిటీ స్టంట్ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి బిజి కోల్సే పాటిల్ వ్యాఖ్యానించారు. 'ఒక న్యాయమూర్తిగా నేను గతంలో ఎన్నో తీర్పులిచ్చాను. మావోయిస్టులు రాసినట్లుగా పేర్కొంటున్న లేఖకు విలువ లేదు. అది నిజంగా అంత ముఖ్యమైన సమాచారం ఉన్న లేఖ అయితే.. దానిని రహస్యంగా ఎందుకు ఉంచలేదు? ఇది కేవలం ప్రచారం జిమ్మిక్కు మాత్రమే.. కోర్టు ఆధీనంలో ఉన్న ఈ లేఖ వెంటనే బీజేపీ అధికార ప్రతినిధి వద్దకు ఎలా చేరింది?` అని జస్టిస్ పాటిల్ ప్రశ్నించారు.

మోడీ హత్య ఎపిసోడ్ లో మరో ఆసక్తికరమైన విషయమేమంటే.. లేఖ విషయం బయటకువచ్చిందిగానీ ఆ లేఖ హోం శాఖకు ఇంతవరకూ చేరలేదు. 'ఆ లేఖ మాకు ఇంకా అందలేదు. దాని ప్రామాణికతపై పోలీసులు దర్యాప్తు చేయాలి' అని హోం శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో ఈ పర్వంపై వివిధ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.