Begin typing your search above and press return to search.

కోర్టు ఆగ్ర‌హించినా త‌గ్గేది లేదంటున్న ప్ర‌భుత్వం

By:  Tupaki Desk   |   28 Oct 2016 5:37 AM GMT
కోర్టు ఆగ్ర‌హించినా త‌గ్గేది లేదంటున్న ప్ర‌భుత్వం
X
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తి అభివృద్ధికి సంబంధించి స్విస్ ఛాలెంజ్ విధానంపై ప్రభుత్వం వెనక్కితగ్గేదిలేదని పురపాలకశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో సింగపూర్ కన్సార్టియంలు చేసిన ఆమోదయోగ్యం కాని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుగానే వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించామని, అయితే ఇందులో పోటీకి వచ్చిన బిడ్‌ లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ఇంతలో హైకోర్టులో వాదోపవాదాలు లేవనెత్తినందున చట్టపరంగా ఆమోదయోగ్యమైన సవరణలు తీసుకొచ్చి మరోసారి రీ ప్రజెంట్ చేస్తామని వివరించారు.

ఇదిలా ఉండగా రాజధానిలో ప్రభుత్వ భవనాల నిర్మాణంపై సీఆర్డీఏతో ముఖ్యమంత్రి జరిపిన సమీక్షా సమావేశం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు వివరించారు. 2018 నాటికి పాలనాపరంగా ప్రభుత్వ భవనాలు - ఐకనిక్ టవర్లు - ఐకానిక్ వంతెనలు పూర్తయ్యేందుకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను కోరారని ఈ మేరకు డిజైన్లు - టెండర్ల ప్రక్రియలపై ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఏడాదిలోపు భవనాల నిర్మాణానికి సంబంధించి ప్రతి నెలా షెడ్యూల్ రూపొందించాలని సిఎం ఆదేశించారని చెప్పారు. కాగా గృహ నిర్మాణంపై జరిగిన సమీక్షలో 2022 కల్లా ప్రతి ఒక్కరికీ సొంతిల్లు ముఖ్యమంత్రి ఆకాంక్షగా వివరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకమైన ఇళ్లను నిర్మించిందని, కాలం చెల్లిన వాటి మరమత్తులకు తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/