Begin typing your search above and press return to search.

హాస్పిట‌లా... బాణ‌సంచా గోడౌనా...?

By:  Tupaki Desk   |   10 Oct 2015 9:47 AM GMT
హాస్పిట‌లా... బాణ‌సంచా గోడౌనా...?
X
ఏపీలో ఆసుప‌త్రులు ప్రాణాలు పోయ‌డం సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ప్రాణాలు తీసేలా త‌యార‌వుతున్నాయి. ఇప్ప‌టికే గుంటూరు ఆసుప‌త్రిలో ఎలుక‌లు ఓ చిన్నారిని కొరికి చంపేసిన సంగ‌తి తెలిసిందే. వైద్య ఆరోగ్య శాఖ‌, ఆ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ పై సీఎం చంద్ర‌బాబు కూడా గుర్రుగా ఉన్నారు. ఇంత జ‌రుగుతున్నా ఆసుప‌త్రుల్లో నిర్ల‌క్ష్యం స్థాయి ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. తాజాగా క‌డ‌ప జిల్లాలోని ఓ ఆసుప‌త్రిలో జ‌రిగిన ఘ‌ట‌న ప్ర‌భుత్వ ఆసుప‌త్రులంటే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డి ప‌రుగులు తీసేలా చేసింది.

క‌డ‌ప జిల్లాలోని ఓబులవారి పల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏకంగా ఆస్పత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌ లో ఉన్న రెండు ఆక్సిజన్‌ సిలిండర్లు పేలి అగ్నిప్ర‌మాదానికి కార‌ణ‌మ‌య్యాయి. మంట‌లు చెల‌రేగ‌డంతో అగ్నిమాపక సిబ్బంది కూడా రావాల్సి వ‌చ్చింది. పేలుళ్లు వినిపించ‌డం... మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, రోగులు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే ఆస్పత్రిలోని ఫర్నిచర్‌, మందులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక‌పోయినా ప్రాణాలు నిలిపాల్సిన ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పేల‌డానికి నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

ఇంత‌వ‌ర‌కు ఎక్క‌డా ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు పేలిన సంఘ‌ట‌న‌లు విని ఉండం... కానీ, అలా జ‌రిగిందంటే అందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డ‌మే కార‌ణం కావాలి. ఆసుప‌త్రుల్లో ఇలా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు కూడా పేలి త‌గ‌ల‌బ‌డుతుంటే రోగులు ఏ న‌మ్మ‌కంతో రాగ‌ల‌రో వైద్య ఆరోగ్య శాఖే చెప్పాలి. గుంటూరు ఆసుప‌త్రిలో ఎలుక‌ల దాడి సంఘ‌ట‌న‌పై ఆ శాఖ మంత్రి ఇటీవ‌ల మాట్లాడుతూ .... ఎలక‌ల‌ను నివారించ‌డం మ‌న‌వ‌ల్ల సాధ్యం కాద‌ని చేతులెత్తేశారు. ఇప్పుడు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల పేలుళ్లును ఆప‌డం కూడా సాధ్యం కాద‌ని చెబుతారో ఏమో చూడాలి.