Begin typing your search above and press return to search.

బంద్ పిలుపుతో అసెంబ్లీ సెషన్ కుదించారా?

By:  Tupaki Desk   |   6 Oct 2015 9:43 AM GMT
బంద్ పిలుపుతో అసెంబ్లీ సెషన్ కుదించారా?
X
ఎన్ని రోజులైనా ఫర్లేదు.. అన్నీ అంశాల మీదా మాట్లాడుకుందాం అంటూ మాటల్లో భరోసా ప్రదర్శించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతలు ఎలా ఉన్నాయో తెలిసిన విషయమే. మజ్లిస్ తప్పించి..మిగిలిన రాజకీయ పక్షాలన్నింటినీ మూకుమ్మడిగా సస్పెన్షన్ వేటేసిన వైనం రాజకీయ వర్గాలకు షాక్ తినిపించింది.

సభను అడ్డుకునేందుకు చేసిన కొద్దిపాటి నిరసనకే ఇంత భారీగా నిర్ణయం ఏమిటని రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోతున్న పరిస్తితి. ఇదిలా ఉంటే.. ఈ నెల 10 వరకు జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్ని తొమ్మిది వరకు జరగనున్నట్లు ప్రకటించారు. దీనికి కారణం పెద్దగా చెప్పనప్పటికీ.. కుదింపు వెనుక.. తెలంగాణ విపక్షాల ప్రభావమే పడిందన్న మాట వినిపిస్తోంది.

మజ్లిస్ మినహా మరో పార్టీ అంటూ లేని అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమైన పరిస్థితి. ఇక.. తెలంగాణ అధికారపక్షం వైఖరికి తీవ్ర నిరసనగా తెలంగాణ విపక్షాలన్నీ కలిసి తెలంగాణ బంద్ ను ఈ నెల 10 నిర్ణయించారు. అయతే.. దీనికో షరతు పెట్టాయి. రైతుల రుణమాఫీని ఒకేదఫా మాఫీ చేయాలని.. అందుకు తెలంగాణ సర్కారుకు ఈ నెల 9 వరకు గడువు ఇచ్చాయి.

తొమ్మిదో తేదీ నాటికి కానీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో పదిన బంద్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విపక్షాల డిమాండ్ ను తెలంగాణ అధికారపక్షం అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో.. విపక్షాల బంద్ ఖాయమనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కష్టమవుతుందన్న ఉద్దేశ్యంతో ముందు జాగ్రత్తగా సమావేశాల్ని ఒక రోజుకు కుదిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. విపక్షాల బంద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కుదింపునకు కారణంగా చెప్పొచ్చు.