కేసీఆర్ పై వారంతా కలిసి ఫైట్ చేస్తారట

Fri Feb 17 2017 22:42:00 GMT+0530 (IST)

తెలంగాణలో రాజకీయం రంజుగా మారుతోంది. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా ప్రతిపక్షాలు మాత్రం ముందే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. గత ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తుచేసూ హామీల అమలు కోసం ప్రజలను పోరాటంవైపు నడిపించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక వాగ్గానాలిచ్చి - మానిఫెస్టోతో ఓటర్లను మెప్పించి  ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేసేందుకు  ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నా.... ఇంకా అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. ప్రభుత్వాలు గత మూడేళ్ళగా చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఉద్యుక్తమవుతుండగా ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు జనం బాట పడుతున్నాయి. ఇంకా ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలుండగానే ప్రతిపక్షాలు తమ హడావుడిని ప్రారంభించాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై పోరాటానికి శ్రీకారం చుట్టాయి. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన అంశాలేవీ అమలుకు నోచుకోవడం లేదని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్గానాలను ప్రభుత్వం మరిచిపోయిందంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రజాకోర్టులో ప్రభుత్వాన్ని ప్రజాకోర్టులో నిలిపేందుకు పావులు కదుపుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణాలో బొటాబొటీ మెజార్టీతోనే టీఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల్లోనే ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేను తన వైపుకు తిపు కోవడం ద్వారా తిరుగులేని శక్తిగా ఎదిగింది. టీడీపీ - కాంగ్రెస్ పార్టీల నుంచి ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. సీపీఐ ఎమ్మెల్యే ఒకరు. వైఎస్ ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు - బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు టీఆర్ ఎస్ తీర్ణం పుచ్చుకున్నారు. బీజేపీ ఎంఐఎం ఎమ్మెల్యేలను మాత్రం టీఆర్ఎస్ ఆకర్షించలేకపోయింది. ఇక సీపీఎం పార్టీ కున్న ఒకే ఎమ్మెల్యే స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్లడంతో ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు కే మొగ్గు చూపుతుండటంతో ఆ పార్టీకి అసెంబ్లీలో నామమాత్రపు ప్రాతినిధ్యమే. ఉన్న ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కోల్పోయినా కూడా టీడిపి కాంగ్రేస్ పార్టీలు మళ్ళీ పుంజుకోవడానికి కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎన్నికలకు రెండేళ్ళ ముందే ఇవి జనంబాట పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్రూం ఇళ్ల దళితులకు మూడెకరాల భూమీ. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని నీటిపారుదల రంగంలో తీవ్ర అవినీతి చోటుచేసుకుందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.

ఈ క్రమంలో టీడీపీ ప్రజాపోరుతో పేరుతో జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రజాపోరు కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో సభ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో నిర్వహించారు. ఈ సభకు అనూహ్యంగా జనం తరలిరావడంతో టీడీపీలో ఉత్తేజం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ జనావేదన సమ్మేళనం పేరుతో 119 నియోజకవర్గాలలో సదస్సులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రజల్లో ఉన్నఅసంతృప్తిని తమవైపు తిప్పకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. సభలంటే నాయకులు మాట్లాడటం కార్యకర్తలు ప్రజలు వింటూ ఉండటం జరుగుతుంది అయితే అందుకు భిన్నంగా ఈ సమ్మేళనాల్లో ప్రజలతో కార్యకర్తలతో మాట్లాడించి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. కాగా ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ బొగ్గుబావుల బాట పడుతోంది. బీజేఎల్చీ నేత కిషన్రెడ్డి సింగరేణి బొగ్గుబావుల వద్దకు వెళ్లికార్మికుల కష్టాలను అడిగి తెలుసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటిదాక గని కార్మికుల కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని నిర్వాసితులకు న్యాయం చేయలేదని పేర్కొంటూ గని కార్మికులను కలిసేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది.

ఇక తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న జేఏసీ నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలంటూ పెద్దఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 22న భారీ ఎత్తున నిరుద్యోగ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. భారీ ఎత్తున యువకులను కదిలించేందుకు అన్ని వర్గాల మద్దతు కూడగడుతూ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రమంతటా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేపట్టిన సీపీఎం పార్టీ కార్యదర్ళి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వం పై విమర్శలను ఎక్కుపెడుతున్నారు. ప్రతి అంశాన్నీ ఆయన ప్రజల ముందుకు తీసుకుపోతున్నారు. వీరే కాకుండా పల్లె దర్శనం పేరుతో గద్దర్ ఉద్యమ వేదిక పేరుతో చెరుకు సుధాకర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి లు కూడా జనంలోనే ఉంటున్నారు. రెండుపడకల ఇళ్లు మూడెకరాల భూమి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఈ మూడు ప్రధానం చేసుకొని ప్రతిపక్షాలు ముందుకు వెళుతున్నాయి.

కాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూనే ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇకనుంచి జనతా దర్బార్లు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో లేరన్న విమర్శనుంచి బయట పడేందుకు ఇకపై క్యాంప్ ఆఫీస్ వేదికగా ముఖ్యమంత్రి ప్రజలను కలువనున్నారు. ఎన్నికలకు మరో రెండేళ్ళన్నా కూడా ఇప్పటి నుంచే అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షాలు పోటీ పడటం ఆసక్తి నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/