Begin typing your search above and press return to search.

చంద్రబాబు.. అధర్మరాజు

By:  Tupaki Desk   |   22 May 2018 4:11 PM GMT
చంద్రబాబు.. అధర్మరాజు
X
విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కాలేజి మైదానంలో ఏపీ సీఎం నిర్వహించిన ధర్మపోరాట బహిరంగ సభలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని - బీజేపీని విమర్శించారు. పనిలో పనిగా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీపైనా విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల వెంకన్న ఆలయ వివాదాన్నీ ప్రస్తావించారు. ఈ విషయంలో బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. అలాగే... ఏపీ హక్కులు కాపాడేందుకు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలతో మాట్లాడేందుకు గాను రేపు బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నట్లు చెప్పారు. అయితే... రెండు నాల్కల మనిషిగా పేరున్న చంద్రబాబు చెప్పిన ఈ మాటల్లో ధర్మం ఎంతని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

తిరుమలలో హిందూ ధర్మాన్ని కాలరాసేలా అన్యమతస్థులను పాలక మండలి పెద్దలుగా నియమించడం ఏం ధర్మమన్న ప్రశ్న వినిపిస్తోంది. సాక్షాత్తు శ్రీనివాసుడి ఆభరణాలనే గోల్ మాల్ చేయడం ఏం ధర్మమన్న ప్రశ్నా వినిపిస్తోంది. ఆగమ శాస్త్ర ఆచారాల ప్రకారం శ్రీవారికి జరుగుతున్న పూజాదికాలను గతి తప్పించడం ఏం ధర్మమన్న ప్రశ్న వినిపిస్తోంది.

అలాగే.. చంద్రబాబు చెబుతున్నట్లు రాష్ట్రం కోసం ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడంపైనా ప్రశ్నల వర్షం కురుస్తోంది. ప్రాంతీయ పార్టీలను కలవడం కోసం బెంగళూరు వెళ్తున్న ఆయనకు రాష్ట్రంలోని మరో ప్రాంతీయ పార్టీ వైసీపీ కనిపించలేదా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడుతుంటే తొలుత మద్దతిస్తానని చెప్పిన చంద్రబాబు రాత్రికి రాత్రి మాట మార్చి తాను వేరేగా అవిశ్వాసం పెట్టడం ఏం ధర్మమని విపక్ష వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. అవిశ్వాసం పెట్టాక అది చర్చకు రాకుండా లోక్ సభలో ప్రతి రోజూ రభస సృష్టించడం ఏం ధర్మమని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి వైసీపీ పోరాడుతుంటే.. ప్రత్యేక హోదా మాటెత్తితే కేసులు పెడతామని భయపెట్టి.. బీజేపీతో విభేదాలు వచ్చాక మళ్లీ స్వప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి.. అప్పటికీ వైసీపీతో కలిసి రాకుండా పోరాటాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసిన చంద్రబాబుది ఏం ధర్మమని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుది ధర్మపోరాటం కాదని.. ఆయనది అధర్మపోరాటమని అంటున్నారు.