Begin typing your search above and press return to search.

విప‌క్షాల అభ్య‌ర్థిగా మాజీ స్పీక‌ర్

By:  Tupaki Desk   |   19 Jun 2017 2:17 PM GMT
విప‌క్షాల అభ్య‌ర్థిగా మాజీ స్పీక‌ర్
X
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే ప్రభుత్వం సీనియ‌ర్ నేత రామ్‌ నాథ్‌ కోవింద్‌ ను ఎంపిక చేసిన నేప‌థ్యంలో ప్రతిపక్షాల అభ్య‌ర్థిత్వంపై చ‌ర్చ జ‌రుగుతోంది. కాంగ్రెస్‌, వామపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ లోక్‌ సభ స్పీకర్‌ మీరా కుమార్‌ ను ప్రకటించాలనే ప్ర‌తిపాద‌న తెర‌మీద‌కు వ‌స్తోంది. మీరా కుమార్‌ లోక్‌ సభకు తొలి మహిళా స్పీకర్‌ గా ఎన్నికయ్యారు. ఈనెల 22న జరిగే విపక్షాల సమావేశంలో ప్రతిపక్షాలు మీరాకుమార్‌ పేరును ప్రకటించనున్నట్లు సమాచారం. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రామ్ నాథ్ కోవింద్ కు మద్దతు విషయంపై కాంగ్రెస్ ఎటూ నిర్ణయం తీసుకోలేదు.

కాగా, రామ్ నాథ్ కోవింద్ కు మద్దతుపై ఇప్పుడే ఏమీ చెప్పజాలమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. విపక్షాలతో చర్చించిన అనంతరమే తమ అభిప్రాయం చెబుతామని పేర్కొన్నారు. మ‌రోవైపు ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేత రామ్ నాథ్ కోవింద్ ఎంపిక పట్ల ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి - కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ హర్షం ప్రకటించారు. రామ్ నాథ్ కోవింద్ ఎంపిక తెలివైన ఎంపిక అని, ఇది మంచి నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇదిలాఉండ‌గా...ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింద్ పేరును బీజేపీ ఏకపక్షంగా ప్రకటించిందని శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏకాభిప్రాయం లేకుండానే రాష్ట్రపతి అభ్యర్థి పేరు ప్రకటించడం సరికాదని పేర్కొన్న శివసేన తాము మద్దతు ఇచ్చేదీ లేనిదీ రేపు ప్రకటిస్తామని పేర్కొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/