బలం లేకున్నా బరిలోకి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి!

Fri May 12 2017 10:10:43 GMT+0530 (IST)

మరికొద్ది నెలల్లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించటానికి అవసరమైన బలాన్ని ఎన్టీయే సర్కారు దాదాపుగా సొంతం చేసుకుందనే చెప్పాలి. యూపీ ఎన్నికల్లో భారీ విజయం నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు అవసరమైన మెజార్టీ దాదాపుగా వచ్చేసింది. కేవలం 20వేల ఎలక్ట్రోరల్ ఓట్లు మాత్రమే అవసరం.

అయితే.. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ తన మద్దతును ఎన్డీయే అభ్యర్థికి ఇవ్వటం.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సర్కారు సైతం.. ఎన్డీయే అభ్యర్థికి ఇచ్చే అవకాశాలు బలంగా ఉన్న నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి విజయం నల్లేరు మీద నడక లాంటిది. బలం లేకున్నా.. బరిలోకి దిగాలన్న ప్రయత్నంతో పాటు.. అనవసరమైన రాజకీయ హడావుడి సృష్టించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని మిగిలిన విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

దేశ అత్యున్నత పదవికి హుందాగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ.. రాజకీయాలతో ప్రయోజనం పొందాలన్న తీరును విపక్షాలు ప్రదర్శిస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. బలం లేకున్నా బరిలోకి దిగాలని భావిస్తున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయంపై ఇప్పటికే పలు పేర్లు వినిపించాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి పేర్లు నాలుగుకు షార్ట్ లిస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు.

ఈ కుదించిన జాబితాలో ఉన్న నాలుగు పేర్లు చూస్తే.. మొదట ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరు వినిపిస్తుండగా.. తర్వాతి పేరు యూపీఏ హయాంలో స్పీకర్ గా వ్యవహరించిన దళిత సామాజిక వర్గానికి చెందిన మీరా కుమార్ పేరు వినిపిస్తోంది.  మూడో వ్యక్తిగా జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ పేరు కాగా.. నాలుగో పేరుగా జాతిపిత మహాత్మాగాంధీ మనమడైన గోపాలకృష్ణ గాంధీ అయితే బాగుంటుందన్న భావన వ్యక్తమవుతోంది.

విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తనను బరిలోకి నిలవాలని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కలిసి కోరినట్లుగా గోపాల్ కృష్ణ గాంధీ చెబుతున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని రాష్ట్రపతి ఎన్నికల్లో నిలపాలన్న విషయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ..  బీహార్.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రులు నితీశ్ కుమార్.. మమతా బెన్జీలతో పాటు.. సీపీఎం.. సీపీఐ పార్టీలు సైతం సుముఖంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. మిగిలిన విపక్షాలు సైతం ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరీ.. నలుగురిలో అంతిమంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/