మోడీకి వ్యతిరేకంగా విపక్షాల కొత్త స్కెచ్

Fri Apr 21 2017 17:47:27 GMT+0530 (IST)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయా? 2019 సాధారణ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు 'మహాబంధనం పేరుతో జట్టుకట్టనున్నాయా? ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ - బీహార్ సీఎం నితీశ్ కుమార్ లు సంకేతాలు ఇచ్చారా? అనే ప్రశ్నలకు న్యూఢిల్లీ రాజకీయవర్గాల్లో 'అవును' అనే జవాబు వినిపిస్తోంది. తాజాగా సోనియా గాంధీ ఇంట్లో నితీశ్ కుమార్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయాలపై చర్చించారు.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీయు-ఆర్ జేడీలు మహాకూటమిగా ఏర్పడి బీహార్ లో బీజేపీ ఓడించిన సంగతి తెలిసిందే. అదే స్ఫూర్తిని కొనసాగించి జాతీయ స్థాయిలోనూ అన్ని పార్టీలు చేతులు కలపాలని నితీశ్ ప్రస్తావించినట్లుగా సమాచారం. దీనికి సోనియగాంధీ సైతం సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కలిసివచ్చే పార్టీలతో ముందుకు సాగేందుకు త్వరలోనే కసరత్తు ప్రారంభించాలని సోనియా ఆదేశించినట్లు సమాచారం.

ఇదిలాఉండగా...జాతీయస్థాయిలో బీజేపీపై పోరుకు శక్తిమంతమైన ప్రాంతీయ పార్టీలు చాలునని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ వ్యాఖ్యానించారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో ఆమె సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ పై విధంగా అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రాంతీయ పార్టీలకు బీజేపీ నుంచి ముప్పు ఉందా? అన్న ప్రశ్నపై ఆమె స్పందిస్తూ ``బీజేపీ మాకు ముప్పని నేను నమ్మడం లేదు. బీజేపీ ప్రజలను విభజిస్తూ రాజకీయ పార్టీల్లో చీలికలు తీసుకొస్తోంది`` అని మండిపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/