Begin typing your search above and press return to search.

చివరకు మోడీ కూడా వారిని మోసం చేశాడు..

By:  Tupaki Desk   |   16 May 2018 6:33 AM GMT
చివరకు మోడీ కూడా వారిని మోసం చేశాడు..
X
కర్ణాటక ఎన్నికల ఫలితాలు బయటకు వచ్చాయి.. ఏఏ పార్టీలు ఎన్ని సీట్లు గెలిచాయనేది తేటతెల్లమైంది. కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా ఓట్ల శాతంపై విశ్లేషనలు మొదలయ్యాయి.. అందరికీ షాక్ కు గురిచేసే అంశం ఏంటంటే కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద జరిగిన ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేలుగా గెలిచిన మహిళలను వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పురుషాధిపత్యం కర్ణాటక ఎన్నికల్లో బాగా ఉందనేదానికి ఈ ఫలితాలు గొప్ప ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కర్ణాటకలో మొత్తం 224 సీట్లలో బీజేపీ ఆరుగురు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. జేడీఎస్ 4 సీట్లు ఇవ్వగా.. కాంగ్రెస్ అత్యధికంగా 15 సీట్లు కేటాయించింది. ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల్లో ‘బేటా-బేటీ సమాన్’ అని నినాదం ఇచ్చారు. తీరా ఎన్నికల సీట్ల విషయానికి వస్తే అత్యల్పంగా 6 సీట్లు మాత్రమే ఇచ్చి తనది మాటల పార్టీనే కానీ.. చేతలది కాదని నిరూపించారు. మొత్తం 224 సీట్లలో మహిళల కోటా 3శాతం మాత్రమే కావడం అందరినీ విస్మయపరుస్తోంది. అన్ని పార్టీలు మహిళాభ్యుదయం అంటూ ఊదరగొట్టే ప్రసంగాలు చేయడం తప్పితే ఎన్నికల్లో సీట్లు మాత్రం ఇవ్వరని కర్ణాటక ఎన్నికలను బట్టి అర్థమైంది.

ఇక ఎన్నికల ఫలితాల్లో కూడా మహిళలకు నిరాశే ఎదురైంది. మొత్తం 222 సీట్లకు ఎన్నికలు జరిగితే అందులో కర్ణాటక మొత్తం మీద కేవలం ఆరుగురు మాత్రం గెలిచారు. ఇందులో 3 కాంగ్రెస్ మహిళామణులు గెలవగా.. 3 బీజేపీ నారీమణులు ఎన్నికయ్యారు. జేడీఎస్ నుంచి ఒక్క మహిళా ఎమ్మెల్యే గెలవకపోవడం గమనార్హం. ఇప్పుడు జేడీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు పూనుకుంది. కానీ ఆ పార్టీ నుంచి ఒక్క మహిళా ఎమ్మెల్యే లేకపోవడంతో మహిళా కోటలో మంత్రి పదవికి ఆస్కారమే లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ జేడీఎస్ కు మద్దతిచ్చినా అందులో మహిళలకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశ కనిపించడం లేదు. ఒక వేళ బీజేపీ గద్దెనెక్కినా కూడా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.

మొత్తంగా దేశంలో పురుషాధిక్య రాజకీయాలు నడుస్తున్నాయని కర్ణాటక ఎన్నికలను బట్టి మరోసారి తేటతెల్లమైంది.