Begin typing your search above and press return to search.

ఈసీ సవాలుకు తోక ముడిచిన పార్టీలు

By:  Tupaki Desk   |   27 May 2017 7:41 AM GMT
ఈసీ సవాలుకు తోక ముడిచిన పార్టీలు
X
ఈవీఎంలు ట్యాంపరింగ్ పై గగ్గోలు పెట్టిన పార్టీలు ఈసీ సవాల్ విసిరే సరికి చల్లగా మారిపోయాయి. తమకు అవకాశం ఇస్తే ట్యాంపరింగ్ చేసి చూపిస్తామని చూపిస్తామని జబ్బలు చరిచిన పార్టీలన్నీ ఈవీఎంలు ట్యాంపరింగ్ కావని, చేయలేరని ఎలక్షన్ కమిషన్ ఎంత చెప్పినా వినకుండా నానా రభస చేశాయి. దీంతో వాటిని ట్యాంపర్ చేసి చూపించాలని ఎలక్షన్ కమిషన్ అన్ని పార్టీలకు సవాలు విసిరింది. జూన్ 3 నుంచి ట్యాంపర్ చేయవచ్చంటూ దేశంలోని 7 జాతీయ పార్టీలు - 48 ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది. ఈ సవాలుతో పార్టీలకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఏర్పడింది. ఏదో విమర్శలు చేయగలమే కానీ ట్యాంపరింగ్ చేయలేం కదా అని అంటున్నాయట ఇప్పుడా పార్టీలు.

ఈసీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సవాల్ చేయడంతో పార్టీలన్నీ ఏదో ఒక కారణంతో తప్పుకున్నాయి. రచ్చరచ్చ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సైలెంటు అయిపోయింది. ఇప్పుడు మిగిలింది కేవలం రెండే రెండు పార్టీలు ... అవి ఎన్‌ సీపీ - సీపీఎం. మరి ఆ రెండూ ఏం చేస్తాయో చూడాలి.

జూన్ 3 నుంచి ట్యాంపరింగ్ కు అవకాశం ఇస్తామని ఈసీ చెప్పింది. ఈసీ విసిరిన ఈ సవాలును ఈ రెండు పార్టీలు మాత్రమే స్వీకరించాయి. బీజేపీ - సీపీఐలు తాము ఈ సవాలులో పాల్గొనడం లేదని ఇది వరకే ఈసీకి చెప్పేశాయి. ఇక గోలగోల చేసిన ఆప్ అయితే.... మదర్‌ బోర్డుల హ్యాక్‌ కు అనుమతించాలని కొత్త పల్లవి అందుకుని మెల్లగా జారుకుంది. సవాలులోని నిబంధనలు సవరించాలంటూ కాంగ్రెస్ కోరింది. అయితే వాటి అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. తాము ఈ చాలెంజ్‌ లో పాల్గొంటామని ఆర్జేడీ శుక్రవారం లేఖ రాసింది. అయితే ఇది సాయంత్రం 5:39 గంటలకు ఈసీకి అందింది. అప్పటికే ఈసీ విధించిన గడువు ముగియడంతో దానికి పాల్గొనే అర్హత లేకుండా పోయింది. దీంతో చివరికి బరిలో ఎన్‌ సీపీ, సీపీఎం మాత్రమే నిలిచాయి. ఇవి ఏం చేస్తాయో తెలియాలంటే జూన్ 3 వరకు ఆగాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/