కోడి కోయందే హైదరాబాదీలకు రోజు గడవదట!

Thu Oct 12 2017 14:33:50 GMT+0530 (IST)

హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అందులోనే ప్రత్యేకించి చికెన్ బిర్యానీ - చికెన్ వంటకాల అమ్మకాలలో భాగ్యనగరం ముందు మిగతా నగరాలన్నీ బలాదూరేనట. సాధారణంగా లంచ్ - డిన్నర్ లలో చికెన్ బిర్యానీని ఎక్కువమంది ఆరగిస్తుంటారు. అయితే హైదరాబాదీలు మాత్రం బ్రేక్ ఫాస్ట్  - స్నాక్స్ లుగా కూడా చికెన్ బిర్యానీనే ఇష్టపడుతున్నారట. స్విగ్గీ  నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో హైదరాబాదీల అభిరుచుల గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దేశంలో చికెన్ ఆర్డర్లలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా బెంగళూరు - ఢిల్లీ - కోల్ కతా - పుణే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని సర్వేలో తేలింది.కోడి కోయందే హైదరాబాదీలకు రోజు గడవడం లేదని స్విగ్గీ సర్వేలో వెల్లడైంది. నగరవాసులు చికెన్ వంటకాలను అన్ని వేళల్లో తినడానికి మొగ్గు చూపుతున్నారని స్విగ్గీ తెలిపింది. చాలామంది హైదరాబాదీయులు లంచ్  - డిన్నర్ సమయాల్లో మాత్రమే కాకుండా ఉదయం బ్రేక్ ఫాస్ట్ - సాయంత్రం స్నాక్స్ టైంలోను చికెన్ బిర్యానీని అడుగుతున్నారట. ఈ ట్రెండ్ ఒక్క హైదరాబాద్ కే పరిమితం కాదని దేశంలోని ప్రధాన నగరాల్లోనూ ఈ ట్రెండ్ కొనసాగుతోందని స్విగ్గీ వెల్లడించింది. వారంలో 5 రోజులపాటు బిజీబిజీగా గడిపేస్తున్న నగరవాసులు వీకెండ్స్ లో మాత్రం చికెన్ వంటకాలు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారట. ప్రత్యేకించి ఆదివారం డిన్నర్ సమయంలో ఆర్డర్లు అధికంగా వస్తున్నాయట. పండుగలు ప్రత్యేక దినాలలలో ఓ మోస్తరుగా ఆర్డర్లు వస్తున్నాయట.

ప్రధానంగా చికెన్ శాండ్ విచ్ - చికెన్ బర్గర్ - చికెన్ బిర్యానీలకే బ్రేక్ ఫాస్ట్ టైంలో ఆరగించేందుకు మక్కువ చూపుతున్నారు. లంచ్ లో చికెన్ బిర్యానీ - ఫ్రైడ్ రైస్ - తందూరి చికెన్ - చికెన్ లాలీపప్ - చికెన్ సబ్ - చికెన్ 65 తదితరాలను తింటున్నారు. స్నాక్స్ టైంలో బిర్యానీ - బర్గర్లతో పాటు చికెన్ రోల్ - చికెన్ మోమో - చికెన్ షా వర్మ - డిన్నర్‌లో చిల్లీ చికెన్ - చికెన్ టిక్కా - గ్రిల్డ్ చికెన్ - చికెన్ బిర్యానీ - చికెన్ రోల్ తదితరాలను ఇష్టపడుతున్నారట.ఇక నగరంలో ఏవైనా వేడుకల సందర్భంగా అయితే చికెన్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయట. ఐపీఎల్ - టెస్ట్ - వన్డే మ్యాచ్ లు ఉన్న రోజుల్లో చికెన్ వంటకాల ఆర్డర్లు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయట. ఆ సమయాల్లో రెట్టింపు ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ తెలిపింది. పర్యాటకులు - మ్యాచ్ చూడడానికి వచ్చేవారి ఆర్డర్లు అధికంగా ఉంటున్నాయట.