సరిగా నిద్రపోరా.. అయితే మీరు చదవాల్సిందే

Sun Apr 15 2018 23:00:02 GMT+0530 (IST)

అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతతో కొత్త కొత్త ప్రయోగాల్ని.. అధ్యయనాల్ని చేపడుతున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనం ఆశ్చర్యానికి గురి చేసేలా ఉండటమే కాదు.. క్రమశిక్షణ లేని జీవితాన్ని గడిపే వారికి ఒక వార్నింగ్ గా మారిందని చెప్పాలి.ఒక్కరోజు సరిగా నిద్ర పోకున్నా అల్జీమర్స్ ముప్పు పెరుగుతుందన్న కొత్త విషయం తాజాగా వెల్లడైన అధ్యయనం ఒకటి స్పష్టం చేస్తోంది. మెదడులోని బీటా అమిలోయిడ్ గా పిలిచే ప్రోటీనులు ఉంటాయని.. ఇవి ఒక చోట పోగుపడటంతో అమిలోయిడ్ వ్యర్థాలు పేరుకుంటాయని తేల్చారు. ఇవి.. అల్జీమర్స్ ముప్పును పెంచుతాయని గుర్తించారు.

తాజాగా అమెరికాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిపుణులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. 22 నుంచి 72 ఏళ్ల మధ్యనున్న వారిలో 20 మంది ఆరోగ్యవంతుల మీద ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో ప్రోటీన్.. నిద్రలేమికి మధ్యనున్న సంబంధాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. 

వీరి మెదడు స్కానింగ్ చిత్రాల్ని పరిశోధకులు పరిశీలించారు. సరిగా నిద్రపోని రోజుకు సంబంధించిన చిత్రాల్ని చక్కగా నిద్రపోయిన రోజు నాటి చిత్రాలతో పోల్చారు. నిద్ర సరిగా పోని రోజున మెదడులోని బీటా అమిలోయిడ్ ప్రోటీన్ స్థాయిలు పెరుగుతున్న విషయాన్ని గుర్తించారు. ఒక రోజు పూర్తిగా నిద్రపోని పక్షంలో గరిస్ఠంగా 5 శాతం ప్రోటీన్లు ఎక్కువ అవుతున్న విషయాన్ని గుర్తించారు. అదే సమయంలో పూర్తిగా నిద్ర పోని రోజు తర్వాత చక్కగా నిద్రపోతే.. ఈ ముప్పు తగ్గుతుందా?  అన్న ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. మొత్తంగా చూస్తే.. సరిగా నిద్ర పోని వారికి ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. అల్జీమర్స్ ముప్పు పొంచి ఉందన్నది మర్చిపోకూడదు.