Begin typing your search above and press return to search.

ప్ర‌తి న‌లుగురిలో...ఒక‌రు బ‌క్రాయేన‌ట‌

By:  Tupaki Desk   |   19 Jun 2018 8:13 AM GMT
ప్ర‌తి న‌లుగురిలో...ఒక‌రు బ‌క్రాయేన‌ట‌
X
క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో ఆన్‌ లైన్ లావాదేవీలు ప్రతీ ఒక్కరికి ఎంతో సమయాన్ని ఆదా చేస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్ల పుణ్యమాని అరచేతిలోనే ఉన్న ఇంటర్నెట్ సదుపాయంతో వ్యయప్రయాసలు లేకుండా ఉన్నచోట నుంచే అన్ని పనులనూ చక్కబెట్టేస్తున్నాం. ఒంటి మీదుండే బట్టల దగ్గర్నుంచి.. వంటింట్లో సరుకులదాకా ఆన్‌ లైన్ వేదికగానే మన అవసరాలను తీర్చేసుకుంటున్నాం. కానీ దేశంలో ఇప్పుడు దాదాపు ప్రతీ నలుగురిలో ఒకరు ఆన్‌ లైన్ ఆర్థిక మోసాలకు గురవుతున్నారని మీకు తెలుసా?.. అడ్వైజరీ సంస్థ ఐడీసీతో కలిసి అంతర్జాతీయ ఆర్థిక సమాచార సంస్థ ఎక్స్‌ పీరియన్ నిర్వహించిన అధ్యయనంలో భారతీయుల్లో 24 శాతం మంది ఆన్‌లైన్ లావాదేవీలను జరుపుతుండగా మోసాల బారినపడుతున్నారని తేలింది.

డిజిటల్ లావాదేవీలు పెరిగినకొద్దీ.. మోసాలూ అంతేస్థాయిలో పెచ్చుమీరుతున్నాయి. అడగ్గానే తమ బ్యాంక్ వివరాలిచ్చో.. లేక ఆకర్షణీయమైన ప్రకటనలకు తలొగ్గో.. కష్టార్జితాన్ని కోల్పోతున్నవారెందరో. ఊరుపేరులేని ఆన్‌లైన్ షాపర్ల వద్ద తక్కువ ధరకే వస్తున్నదని బుక్కైపోతున్నారు. ముఖ్యంగా టెలికం - బ్యాంకింగ్ - రిటైల్ రంగాల్లో అత్యధిక బాధితులుండటం గమనార్హం. టెలికం రంగంలో ఎక్కువగా 57 శాతం మంది వినియోగదారులు మోసాలకు లోనవుతున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో 54 శాతం, రిటైల్ రంగంలో 46 శాతం చొప్పున నష్టపోతున్నారు. టెక్నికల్ దొంగలు అమాయకులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. ఆన్‌ లైన్ మోసాలకు తావున్నా ఎలక్ట్రానిక్స్ - ట్రావెల్ మార్కెటీర్లు సమర్థవంతంగా వినియోగదారుల వివరాలను - లావాదేవీలను నిర్వహిస్తుండటం గమనార్హం.

అయితే మోసం అనేది నాణేనికి ఒకవైపున్నట్లే ఆన్‌ లైన్ లావాదేవీలను ఎంజాయ్ చేస్తున్నవారు లేకపోలేదు. దేశ జనాభాలో 50 శాతం మంది బ్యాంకులతో తమ వివరాలను సౌకర్యవంతంగా పంచుకుంటున్నారు. బ్రాండెడ్ రిటైలర్స్‌తోనూ 30 శాతం మంది సంతోషంగా కొనుగోళ్లు జరుపుతున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కాగా, సగటున 65 శాతం మంది మొబైల్ పేమెంట్లకే మొగ్గుచూపుతున్నారు. అన్నివేళలా సౌకర్యవంతంగా ఉండటమే ఇందుకు కారణమని సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. అలాగే 51 శాతం మంది తమ వ్యక్తిగత సమాచారాన్ని వివిధ సర్వీసుదారులకు ఇష్టపూర్వకంగానే అందిస్తున్నారు. ఇదిలావుంటే 6 శాతం మంది మాత్రం తాము అందించిన సమాచారంపై జాగ్రత్త పడుతున్నారు. జపాన్‌ లో వీరి సంఖ్య 8 శాతంగా ఉంది. ఈ ఆన్‌ లైన్ సర్వే ఆసియా-పసిఫిక్‌ లోని పది దేశాల్లో జరుగగా, భారత్‌ తోపాటు ఆస్ట్రేలియా - చైనా - హాంకాంగ్ - ఇండోనేషియా - జపాన్ - న్యూజీలాండ్ - సింగపూర్ - థాయిలాండ్ - వియత్నాం దేశాల్లోనివారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ దేశాల్లో అత్యధికంగా భారత్‌ లోనే డిజిటల్ వినియోగదారులుండగా, సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 90 శాతం మంది డిజిటల్ లావాదేవీలను జరుపుతున్నట్లు తెలిపారు. మరో ఆసక్తికర విషయమేమిటంటే ఆసియా-పసిఫిక్ రీజియన్‌ లో తప్పుడు డేటా షేరింగ్‌ లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. మ‌న‌దేశంలో 70 శాతం మంది అసత్య వివరాలను పంచుకుంటున్నట్లు ఈ అధ్య‌య‌నం వెల్ల‌డించింది.