Begin typing your search above and press return to search.

వాజ్‌ పేయి ప్రధాని అవుతారని ఆనాడే చెప్పిన నెహ్రూ

By:  Tupaki Desk   |   16 Aug 2018 1:48 PM GMT
వాజ్‌ పేయి ప్రధాని అవుతారని ఆనాడే చెప్పిన నెహ్రూ
X
మూడుసార్లు దేశానికి ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి ఆ స్థాయికి ఎదుగుతారని దేశ తొలి ప్రధాని నెహ్రూ అప్పట్లోనే అంచనా వేశారట. రాజకీయ పరిణతి - అపార జ్ఞానం - వాక్పటిమతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ వంటి అనేక కారణాలతో వాజ్‌ పేయి నెహ్రూ మనసు దోచుకున్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు లోక్‌ సభలో జనసంఘ్ నేతగా ఉన్నారు వాజ్‌పేయి. అయితే... ఆయన సభలో మాట్లాడితే ఎవరైనా సరే చెవులప్పగించి వినేవారట. అందుకు నెహ్రూకూడా మినహాయింపు కాదు. వాజ్‌ పేయి లేచి నుంచి సభలో ప్రసంగం మొదలుపెట్టగానే నెహ్రూ వెంటనే అలర్టయి ఆయన ప్రసంగం పూర్తయ్యేవరకు వినేవారట.

అంతేకాదు.. ఒకసారి బ్రిటన్ ప్రధాని భారత పర్యటనకు రాగా వాజ్‌పేయిని పరిచయం చేసిన నెహ్రూ ఆ సందర్భంలో ఏమన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇతను విపక్షనేత వాజ్‌ పేయి - నిత్యం నన్ను విమర్శిస్తుంటారు కానీ, ఎంతో భవిష్యత్తు ఉన్న నేత అంటూ పరిచయం చేశారట. ఇంకోసారి అలాగే విదేశీ నేతలకు వాజ్‌ పేయిని పరిచయం చేస్తూ.. భవిష్యత్ భారత ప్రధాని అని చెప్పారట నెహ్రూ.

ఇక వాజ్‌ పేయిది కూడా అదే శైలి. రాజకీయ శత్రుత్వాలకు - వాస్తవాలకు మధ్య భేదం ఆయనకు బాగా తెలుసు. 1971లో భారత్ - పాకిస్థాన్ యుద్ధం తరువాత ఆయన పార్లమెంటులో ఇందిరాగాంధీ విజయాన్ని నిండు మనసుతో మెచ్చుకున్నారట. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతలే ఇంతవరకూ ఎవరూ ఆమెను మెచ్చుకోని రీతిలో దుర్గాదేవి అవతారం ఇందిర అంటూ ప్రశంసించారట.

ఇందిరాగాంధీ తరహాలోనే వాజ్‌ పేయి కూడా తాను ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్థాన్ పీచమణిచారు. కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ ను భారతసేనలు తరిమితరిమి కొట్టాయంటే అది వాజ్‌ పేయి గొప్పదనమే.