ఎగ్జిట్ పోల్స్ కోసమైనా.. ఇంకో నెల రోజులు ఆగాలి!

Fri Apr 19 2019 20:00:02 GMT+0530 (IST)

ఇప్పటికే ఏపీలో పోలింగ్ పూర్తి అయ్యి వారం గడిచిపోయింది. నిన్నటితో రెండో దశ పోలింగ్ కూడా ముగిసింది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకూ నూటా తొంబై నియోజకవర్గాల్లో దాదాపుగా పోలింగ్ ముగిసింది. మరో మూడు వందల యాభై సీట్లలో పోలింగ్ జరగాల్సి ఉంది.తదుపరి దశ ఎన్నికల పోలింగ్ ఈ నెల ఇరవై మూడున జరగబోతూ ఉంది. ఓవరాల్ గా ఫలితాల వెల్లడికి మూడో దశ పోలింగ్ నాటి నుంచి నెల రోజుల పాటు సమయం ఉంటుంది.

ఇక వచ్చే నెల పంతొమ్మిదితో ఎన్నికల పోలింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది. ఏవైనా రీ పోలింగ్ ఉంటే చెప్పలేం కానీ..మే పంతొమ్మిదితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దాదాపు పరిసమాప్తం అవుతుంది. మరి అదే రోజున ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవడానికి కూడా అవకాశం ఉండటం గమనార్హం.

ఏతావాతా వచ్చే నెల పంతొమ్మిది తేదీన సాయంత్రానికి ఎగ్జిట్ పోల్స్ హోరెత్తనున్నాయి. అయితే అప్పటికి జనాల్లో కాస్త ఆసక్తి కూడా తగ్గే అవకాశం ఉంది. ఫలితాలపై ఆసక్తి ఉంటుందని కానీ - ఎగ్జిట్ పోల్స్ మీద అప్పుడు పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చు.

ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ యథాతథంగా నిజం అవుతాయని చెప్పడానికి లేదు. అందులోనూ.. అసలు ఫలితాలు రావడానికి నాలుగు రోజుల ముందు ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. జాతీయ స్థాయి రాజకీయాల విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఆసక్తిదాయకంగా ఉండబోతున్నాయి. దేనికైనా  ఇంకా నెల రోజులు ఆగాల్సిందే!