Begin typing your search above and press return to search.

ముంబై వెర్సోవా బీచ్ లో అరుదైన ఘ‌ట్టం!

By:  Tupaki Desk   |   23 March 2018 12:33 PM GMT
ముంబై వెర్సోవా బీచ్ లో అరుదైన ఘ‌ట్టం!
X
దాదాపు రెండు ద‌శాబ్దాల త‌ర్వాత ముంబైలోని వెర్సోవా బీచ్ లో ఓ చారిత్ర‌క ఘ‌ట‌న జ‌రిగింది. 20 ఏళ్ల క్రితం ముంబై బీచ్ ల‌ను వ‌దిలి వెళ్లిపోయిన ఆలివ్ రిడ్లీ ట‌ర్టిల్స్( అరుదైన జాతి తాబేళ్లు) మ‌ళ్లీ ముంబై బీచ్ కు తిరిగి వ‌చ్చాయి.ప‌సిఫిక్ రిడ్లీ అని కూడా పిలుచుకునే ఈ తాబేళ్లు ఇన్నాళ్ల త‌ర్వాత ముంబై బీచ్ లో సంద‌డి చేయ‌డంతో వాటిని చూసేందుకు ముంబై వాసులు క్యూ క‌డుతున్నారు. త‌మ పాత స్నేహితులు ముంబై బీచ్ కు త‌ర‌లి రావ‌డంతో ముంబైక‌ర్ల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప్ర‌స్తుతం బీచ్ లో సంద‌డి చేస్తోన్న‌ ఈ తాబేలు పిల్ల‌ల ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. నెటిజ‌న్లు ఈ బుజ్జి తాబేళ్ల గురించే సోష‌ల్ మీడియాలో చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. 20 ఏళ్ల క్రితం ముంబైలోని బీచ్ ల‌లో కాలుష్యం కార‌ణంగా రిడ్లీ ట‌ర్టిల్స్ ఆ బీచ్ ల‌ను వ‌దిలి వెళ్లిపోయాయి.

ఆలివ్ రిడ్లీ ట‌ర్టిల్స్ అంత‌రించిపోతున్నాయ‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ యూనియ‌న్ ఫ‌ర్ క‌న్జ‌ర్వేష‌న్ ఆఫ్ నేచ‌ర్(ఐయూసీఎన్) తెలిపింది. వాటి సంఖ్య‌ను పెంచేందుకు, పున‌రుత్ప‌త్తి చేప‌ట్ట‌క‌పోతే భవిష్య‌త్తులో వాటి మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంద‌ని చెప్పింది. అయితే, కొద్ది రోజులుగా బీచ్ ల‌ను శుభ్రం చేసేందుకు కొంత‌మంది యువ‌కులు క్లీన్ అప్ డ్రైవ్ ల‌ను చేప‌ట్టారు. గ‌డ‌చిన రెండేళ్ల‌లో సామాన్యులతో పాటు సెల‌బ్రిటీలు కూడా వెర్సోవా బీచ్ ను శుభ్ర‌ప‌రిచేందుకు ముందుకు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో, కొంత‌మంది యువ‌త ఆలివ్ రిడ్లీ ట‌ర్టిల్స్ గుడ్లు పొదిగేందుకు ముంబై వెర్సోవా బీచ్ లో అనువైన వాతావ‌ర‌ణం క‌ల్పించారు. చివ‌ర‌కు ఆ గుడ్లు పొదిగే విజ‌యవంతంగా పూర్తవ‌డంతో దాదాపు 80 రిడ్లీ ట‌ర్టిల్స్ పిల్ల‌లు బీచ్ ఒడ్డుకు చేరుకున్నాయి. దాదాపు 20 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఆ తాబేళ్లు బీచ్ లో సంద‌డి చేయ‌డంతో వాటిని చూసేందుకు ముంబైక‌ర్లు క్యూ క‌డుతున్నారు. ఆ తాబేలు పిల్ల‌ల ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.