Begin typing your search above and press return to search.

అమ్మ ఓడిపోవటం ఖాయమంటున్న తాజా సర్వే

By:  Tupaki Desk   |   1 May 2016 10:02 AM GMT
అమ్మ ఓడిపోవటం ఖాయమంటున్న తాజా సర్వే
X
ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదు కానున్నాయా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకూ ఉన్న సర్వే ఫలితాల ప్రకారం తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పక్షం పక్కాగా గెలవటం ఖాయమని.. అమ్మ చేతికి మరోసారి అధికారపగ్గాలు పక్కా అని ఇప్పటివకూ బయటకు వచ్చిన సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ మీడియా సంస్థలు చేసిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది.

అయితే.. ఇందుకు భిన్నంగా విడుదలైన తాజా సర్వే ఫలితం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈసారి ఎన్నికల్లో అమ్మ నేతృత్వంలోని అన్నాడీఎంకేకు పరాభవం తప్పదని అంచనా వేస్తున్నరు చెన్నై లయోలా కాలేజీ పూర్వ విద్యార్థులు. మార్చి 29 నుంచి ఏప్రిల్ 28 వరకూ రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమందితో కలిపి తాము సర్వే నిర్వహించామని.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఓటమి ఖాయమని తేల్చారు.

ప్రతిపక్ష డీఎంకే తాజా ఎన్నికల్లో విజయం సాధించటం ఖాయంగా పేర్కొన్నారు. లయోలా కాలేజ్ పూర్వ విద్యార్థుల సర్వే అంచనాల ప్రకారం విపక్ష డీఎంకేకు 124 సీట్లు రానున్నాయని.. అదే సమయంలో అన్నాడీఎంకేకు 90 స్థానాలు వస్తాయని చెబుతున్నారు. మూడో కూటమిగా ఉన్న నటుడు విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కారణంగానే అన్నాడీఎంకూ ఓటమి పక్కా అయ్యిందని చెబుతున్నారు.

జయలలిత సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత ఉందని.. డీఎండీకే కారణంగా అన్నాడీఎంకే ఓట్లలో చీలిక రానుందని.. ఇది విపక్ష డీఎంకే కు లాభం చేస్తుందని విశ్లేషించారు. డీఎంకేకు 39.04 శాతం ఓట్లు వస్తాయని.. అన్నాడీఎంకేకు 35.22 శాతం ఓట్లు వస్తాయని.. డీఎండీకే కూటమికి 16 శాతం ఓట్లు వచ్చే వీలుందన్న అంచనాలు వేశారు. ఎన్నికల్లో అమ్మ గెలుపు తిరుగులేదన్న ధీమాతో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నేతలు.. కార్యకర్తలకు తాజా సర్వే ఫలితాలు షాకింగ్ గా మారాయని చెప్పాలి.