Begin typing your search above and press return to search.

మోడీ హామీలను గుర్తు చేసేందుకు..పాదయాత్ర!!

By:  Tupaki Desk   |   17 Jun 2018 5:40 AM GMT
మోడీ హామీలను గుర్తు చేసేందుకు..పాదయాత్ర!!
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సార‌థ్యంలోని బీజేపీ శ్రేణులు అవాక్క‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇంకా చెప్పాలంటే మోడీ టీం త‌మ నాలుగేళ్ల ప్రచార ఆర్భాటాన్ని ప‌క్క‌న‌పెట్టి హామీల గురించి ఆలోచించుకోవాల్సిన సంద‌ర్భం. ఎందుకంటే...ఒడిషాకు చెందిన యువకుడు కాలి నడకన ఢిల్లీకి బయలుదేరాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇప్పటివరకు ఏకంగా 1,350 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఎలాగైనా మోడీని కలిసి తీరుతానని అతడు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఇదంతా ఎందుకంటే..మోడీ ఇచ్చిన హామీని ఆయ‌న‌కు గుర్తుచేయ‌డం, దాన్ని అమ‌లు చేయాల‌ని కోరేందుకు.

2015లో ప్రధాని మోడీ.. ఒడిషాలో పర్యటించిన సందర్భంగా అక్కడి ప్రజలకు పలు హామీలిచ్చారు. వీటిలో రూర్కెలాలోని ఇస్పత్‌ జనరల్‌ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడటం, బ్రాహ్మిణీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్న హామీలు ప్రధానంగా ఉన్నాయి. కాగా.. ఈ రెండింటి విషయంలో ఇప్పటికీ ముందడుగు పడలేదు. దీంతో మోడీకి ఆయన ఇచ్చిన హామీలను గుర్తు చేయాలని భావించిన రూర్కెలాకు చెందిన యువకుడు ముక్తికాంత్‌ బిస్వాల్‌(30) ఏప్రిల్‌ 16న జాతీయ జెండా చేతిలో పట్టుకొని పాదయాత్ర ప్రారంభించాడు. పట్టు వదలని విక్రమార్కుడిలా ఏకంగా 1,350 కిలోమీటర్లు నడిచాడు. కానీ, ఆయన నడక ఆగ్రా హైవే మీదకు చేరుకోగానే సొమ్మసిల్లి కింద పడిపోయాడు. దీంతో ఆస్పత్రిలో చేరక తప్పని పరిస్థితి నెలకొంది.ముక్తికాంత్‌ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన మీడియాతో ముక్తికాంత్ మాట్లాడుతూ ఇస్పాత్‌ ఆస్పత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక రోజురోజుకూ రోగుల మరణాల సంఖ్య పెరుగుతున్నదని ముక్తికాంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రధాని మోడీ.. మా రాష్ట్రానికొచ్చి వరాల జల్లు కురిపించారు. ఇక మా బతుకులు బాగుపడినట్టేనని సంబురపడ్డాం. కానీ, ఏళ్లు గడిచిపోయినా మోడీ ఇచ్చిన హామీలు నెరవేరలేదు.. మా జీవితాల్లో మార్పు రాలేదు. మోడీ ఇచ్చిన వాగ్దానాలు మరిచిపోయాడేమో...మళ్లీ ఆయనకు ఇవన్నీ గుర్తు చేస్తేనే బాగుంటుంది' అంటూ వాపోయాడు. బ్రాహ్మిణీ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదన్నారు. ఎలాగైనా ప్రధాని మోడీని కలుస్తానని, హామీలు నెరవేర్చాలని ఆయన్ను కోరుతానని ముక్తికాంత్‌ దీమా వ్యక్తం చేస్తున్నాడు.