Begin typing your search above and press return to search.

మోడీ చేతుల మీదుగా సన్మానం..గంటల్లోనే అదృశ్యం

By:  Tupaki Desk   |   21 April 2017 9:40 AM GMT
మోడీ చేతుల మీదుగా సన్మానం..గంటల్లోనే అదృశ్యం
X
మొన్న ఒడిశాలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశం సందర్భంగా పలువురిని ప్రధాని నరేంద్ర మోడీ సత్కరించారు. అయితే... అలా మోడీ నుంచి సన్మానం అందుకున్నవారిలో ఒక కుటుంబం మాత్రం ఆ తరువాత కొద్ది గంటల్లోనే కనపడకుండా పోయింది. వారి అదృశ్యం వెనుక కారణమేంటన్నది తెలియకపోయినా రకరకాల ప్రచారాలు మాత్రం జరుగుతున్నాయి. మరోవైపు ఒడిశా కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో బీజేపీని తప్పు పడుతున్నారు. బీజేపీ కారణంగానే ఆ కుటుంబానికి ఇప్పుడు కష్టమొచ్చిందని ఆరోపిస్తున్నారు.

మోడీ రాక సందర్భంగా మొత్తం 17 మందిని సన్మానించాలని నిర్ణయించగా, అందులో జయపురానికి చెందిన దివంగత లక్ష్మీ పండా కుటుంబం కూడా ఉంది. వారిని సన్మానానికి తేవాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశాల మేరకు - నాల్కో అధికారులు లక్ష్మీపండా కుమారుడు నరేంద్ర పండా - కోడలు సుజాత - మనుమరాలు భర్త బుల్లు సాహు - మనవడు బబులా పండాలను భువనేశ్వర్ కు తీసుకెళ్లారు.

వారిని ప్రధాని మోదీ 16వ తేదీన స్వయంగా సత్కరించగా, అదే రోజు రాత్రి వారంతా హిరాఖండ్‌ రైలులో వెనక్కు వెళ్లేందుకు భువనేశ్వర్ రైల్వే స్టేషనుకు వెళ్లారు. ఆ తరువాత వారు కనిపించలేదు. ఆపై 17 రాత్రి లక్ష్మీపండా మనుమరాలు భర్త బుల్లు సాహు జయపురం చేరుకుని తనతో వచ్చిన మిగతావారంతా అదృశ్యమైనట్టు చెప్పడంతో, పోలీసు కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా - రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకుని పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టగా, బాలేశ్వర్ ప్రాంతంలో సుజాత ఉన్నట్టు అధికారులు గుర్తించి, గురువారం నాడు ఆమెను జయపురం చేర్చారు. బబులా పండా ఆచూకీ మాత్రం ఇంకా లభ్యం కాలేదు. ఇప్పుడీ ఘటన రాజకీయ రంగు పులుముకోగా, వీరంతా అదృశ్యం కావడానికి బీజేపీయే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ప్రయాణంలో అనుకోకుండా తప్పిపోయారా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అని పోలీసులు వెతుకుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/