Begin typing your search above and press return to search.

అక్టోబరు 22న ఏం జరగబోతోంది?

By:  Tupaki Desk   |   27 Aug 2015 8:58 AM GMT
అక్టోబరు 22న ఏం జరగబోతోంది?
X
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారం రాబడుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ ద్వారా ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ సచివాలయం, వివిధ శాఖాదిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగుల్లో 50 శాతం మంది తరలింపునకు సుముఖంగా ఉంటే.. అక్టోబర్ 22 నాటికి విజయవాడలో తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం పత్రాలు అందచేసినట్లు తెలిసింది. అందులో విజయవాడకు వెళ్లడానికి మీరు సుముఖంగా ఉన్నారా అని అడగడంతో పాటు వివిధ అంశాలపై ప్రశ్నలున్నాయి.

ఉద్యోగులు సమాధానాలు ఇచ్చాక.. వారి అభిప్రాయాల్ని క్రోడీకరించి.. తరలింపుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. 50 శాతం పైగా తరలింపునకు ఓకే అంటే తక్షణం విజయవాడలో భవనాలు సమకూర్చుకోవడంపై అధికారులు దృష్టిపెడతారు. అద్దె భవనాలు సిద్ధం చేసి.. అక్టోబరు 22 నాటికి ఉద్యోగులు, అధికారుల్ని అక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఇదంతా సరే కానీ.. ఉద్యోగుల నుంచి విముఖత ఎదురైతే.. ప్రభుత్వ ఆలోచన ఎలా ఉంటుందో చూడాలి. ఇలా ఉద్యోగులు తర్వాత కూడా విముఖత ప్రదర్శిస్తే తరలింపు అలాగే ఆపేస్తారా అన్నది చూడాలి. తరలింపు తప్పదనకున్నపుడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్లిపోవాలి తప్పితే.. అభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయాలు తీసుకోవడం సమంజసమేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది.