ఒబామాకు ఉద్యోగం ఇస్తానంటున్న బడా కంపెనీ

Wed Jan 11 2017 22:27:18 GMT+0530 (IST)

ఈనెల 20వ తేదీన పదవీ విరణమ చేయనున్న అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామాకు అనూహ్య ఆఫర్ ఒకటి వచ్చింది. ఎనిమిదేళ్లు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఒబామా మరో పది రోజుల్లో ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. అయితే రిటైర్మెంట్ తర్వాత ఏంటని ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఆయనకు ఇప్పటికే ఓ జాబ్ ఆఫర్ వచ్చేసింది. ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సర్వీస్ స్పాటిఫై ఒబామాకు జాబ్ ఇస్తామని ప్రకటించింది. దాని సీఈవో డేనియెల్ ఏక్ తన ట్వీట్‌లో ఈ ఆఫర్ ప్రకటించారు.

ప్రెసిడెంట్ ఆఫ్ ప్లేలిస్ట్స్ అన్న హోదా కోసం ఉద్యోగి కావాలని అగ్రరాజ్యాన్ని కనీసం ఎనిమిదేళ్లు పాలించిన అనుభవం ఉన్న వ్యక్తి కోసం చూస్తున్నామని సరదాగా ఓ యాడ్ రూపొందించారు. ఆ వ్యక్తి నోబెల్ పీస్ ప్రైజ్ గెలిచినవారై ఉండాలన్న నిబంధన కూడా విధించింది. 2009లో ఒబామాకు శాంతి బహుమతి వచ్చిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారులు తెలిసిన వ్యక్తి అయితే ఇంకా మంచిది అని కూడా ప్రకటించింది. వివిధ రంగాల్లోని కళాకారులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. ప్లేలిస్ట్స్ గురించి ప్రెస్‌మీట్లలో అనర్గళంగా మాట్లాడే వ్యక్తి కావాలి అని ఆ యాడ్‌లో స్పాటిఫై చెప్పింది. ప్రపంచ చరిత్రలో అత్యుత్తమ వక్తల్లో ఒకరిగా ఉండాలంటూ ఒబామాను పరోక్షంగా పొగుడుతూ ఈ యాడ్ రూపొందించింది. యాడ్ చివర్లో తాను స్పాటిఫైలో జాబ్ కోసం ఇంకా ఎదురుచూస్తున్నానని ఈ మధ్యే ఒబామా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ కూడా ఉండటం విశేషం.

ఒబామాకు కొలువును  ప్రదిపాదిస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచ పెద్దన్న రథసారథిగా పనిచేసిన ఒబామాకు జాబ్ ఆఫర్ ఇస్తూ వచ్చిన ప్రతిపాదన ఆసక్తికరంగా ఉందని పలువురు రీట్వీట్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/