Begin typing your search above and press return to search.

ఒబామా ట్వీట్ ఎందుకంత సంచ‌ల‌న‌మైంది?

By:  Tupaki Desk   |   16 Aug 2017 9:31 AM GMT
ఒబామా ట్వీట్ ఎందుకంత సంచ‌ల‌న‌మైంది?
X
అతివాదుల మాట‌లు విన్నంత‌నే చాలామంది ర‌గిలిపోతుంటారు. భావోద్వేగానికి గురి అవుతుంటారు. వారి మాట‌లు మిర్చి బ‌జ్జీల మాదిరి హాట్ హాట్ గా ఉంటాయి. కానీ.. అలాంటి అతివాదుల చేతికి అధికారం వ‌చ్చి.. ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ప్పుడే.. మిత‌వాదుల విలువ తెలుస్తుంది. ప్ర‌స్తుతం అమెరికాలో అలాంటి ప‌రిస్థితే ఉంది. ఎవ‌రెన్ని చెప్పినా ట్రంప్ గెలుపును అమెరిక‌న్లు కోరుకోలేద‌న్న మాట‌ను ప‌లువురు అమెరిక‌న్లు స్ప‌ష్టం చేస్తుంటారు. అయితే.. గుట్టుగా ఆయ‌న్ను అభిమానించే వారు మూకుమ్మ‌డి ఓట్లు వేయ‌టం వ‌ల్లో.. కొంద‌రు చెప్పిన‌ట్లు ర‌ష్యా సాంకేతిక స‌హ‌కార‌మో కానీ అనూహ్యంగా విజ‌యం సాధించారు. అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఎన్నిక‌ల వేళ‌.. అధికారంలో కోసం ఎవ‌రికి వారు త‌మ త‌మ స్టాండ్ల‌ను వినిపించుకోవ‌టం మామూలే. అయితే.. అతివాద ముద్ర ఉన్న వారు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే త‌మ తీరును మార్చుకోవ‌టం చాలామందిలో క‌నిపిస్తుంది. ట్రంప్ నుంచి కూడా అదే ఆశించారు. కానీ.. అలాంటిదేమీ జ‌ర‌గ‌క‌పోవ‌టం అమెరిక‌న్ల‌తో పాటు.. ప‌లు దేశీయుల్ని బాధిస్తుంది. ఇదిలా ఉండ‌గా.. ఈ మ‌ధ్య‌న అమెరికాలోని వ‌ర్జీనియాలో జాతి వివ‌క్ష దాడులు జ‌ర‌గ‌టం.. పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చెల‌రేగటం సంచ‌ల‌నంగా మారింది. ఈ ఉదంతాన్ని అతివాదిగా చెప్పే ట్రంప్ సైతం ఖండించారు. నిర‌స‌న‌కారుల తీరును ఆయ‌న తప్పు ప‌ట్టారు.

అయితే.. అమెరికా మాజీ అధ్య‌క్షుడు.. విజ‌య‌వంత‌మైన అమెరిక‌న్ అధ్య‌క్షుల్లో ఒక‌రిగా నిలిచే బ‌రాక్ ఒబామా తీరు ఎలా ఉంటుందో తెలిసిందే. తాజాగా చోటు చేసుకున్న జాతి వివ‌క్ష దాడుల‌పై స్పందించారు. స్వ‌యంగా ఒక ట్వీట్ పెట్టారు. అంతే.. దానికి లైకుల సునామీతో స‌ద‌రు పోస్ట్ అత్య‌ధిక లైక్ లు పొందిన పోస్టుగా రికార్డు సృష్టించింది. అంతేనా ల‌క్ష‌లాది మంది రీట్వీట్ చేస్తూ.. స‌ద‌రు ట్వీట్ పెద్ద ట్రెండ్ గా మారింది.

అంత సంచ‌ల‌నం సృష్టించిన ఒబామా ట్వీట్ లో ఏముందో చూస్తే.. "పుట్టేట‌ప్పుడు ఎవ‌రూ ఇత‌రుల్ని ద్వేషిస్తూ పుట్ట‌లేదు. చ‌ర్మం.. రంగు.. నేప‌థ్యంలో.. మ‌తాన్ని అనుస‌రించి వివ‌క్ష చూపించ‌టం పుట్టుక‌తో వ‌చ్చిన‌వి కాదు" అంటూ నెల్స‌న్ మండేలా జీవిత చ‌రిత్ర లాంగ్ వాక్ టు ఫ్రీడ‌మ్ నుంచి ఈ మాట‌ల్ని కోట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ర‌క‌ర‌కాల వ‌ర్ణాల‌తో ఉన్న పిల్ల‌ల‌తో తాను దిగిన ఫోటోల్ని ఆయ‌న షేర్ చేశారు. ఆయ‌న ట్వీట్ ను 29 ల‌క్ష‌ల మంది లైక్ చేయ‌గా.. 11 ల‌క్ష‌ల మంది రీట్వీట్ చేశారు. ఇక‌.. 46 వేల‌మందికి పైనే కామెంట్లు రావ‌టం గ‌మ‌నార్హం.