పన్నీర్ కోర్కెలకు అంతు లేకుండా పోతుందా?

Fri Apr 21 2017 11:01:22 GMT+0530 (IST)

సమయం వచ్చినప్పుడు చెలరేగిపోవాలి. అవకాశం చిక్కినప్పుడే తానేంటో చూపించాలి. అధిపత్యం ప్రదర్శించేందుకు ఛాన్స్ దక్కితే ఎంతగా చెలరేగిపోవాలో ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ ఓ సెల్వాన్ని చూసి నేర్చుకోవాలంటున్నారు. అమ్మకు వీర విధేయుడిగా.. అమ్మ మాటను తూచా తప్పకుండా పాటించే గుణం ఉన్న పన్నీర్ లోని కొత్త కొత్త కోణాలు ఈ మధ్యన కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అమ్మ తర్వాత చిన్నమ్మకు వంగి.. వంగి దండాలు పెట్టిన పన్నీర్ కు.. అమ్మ ఆత్మ వచ్చి అలెర్ట్ చేయటంతో ఒక్కసారిగా మారిపోయిన పన్నీర్.. చిన్నమ్మపై తిరుగుబాటు స్వరాన్ని వినిపించటమే కాదు.. ఆమెకు వ్యతిరేకంగా జట్టు కట్టటమే కాదు.. ఆమె అధిపత్యాన్ని సవాలు విసిరారు కూడా.

అయితే.. ఫస్ట్ రౌండ్లో చిన్నమ్మ ప్లానింగ్ ముందు పన్నీర్ తేలిపోయారు. చిన్నమ్మతో పోలిస్తే.. పన్నీర్ కు ప్రజాభిమానం మెండుగా ఉన్నా.. అదంతా చిన్నమ్మ మీద ఉన్న ఆగ్రహంతో తప్పించి.. పన్నీర్ మీద ఉన్న సహజసిద్ధమైన ప్రేమతో కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. జనామోదం పుష్కలంగా ఉన్న పన్నీర్.. ప్లానింగ్ ఫెయిల్ కావటంతో చిన్నమ్మ వర్గం పవర్ లోకి వచ్చేసింది. అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో చిన్నమ్మకు మంగళం పాడేసే అద్భుత అవకాశం పన్నీర్‌కు లభించింది.

తన వెనుకున్న అదృశ్యశక్తుల బలం తోడు కావటంతో పన్నీర్ చెలరేగిపోతున్నారు. తమను నడిపించాల్సిన చిన్నమ్మ జైల్లో ఉండటం.. ఆమె బంటు ఇష్టారాజ్యంగా వ్యవహరించి.. తాను మునిగింది కాకుండా.. తన చుట్టూ ఉన్న వారందరిని ముంచేసే పరిస్థితి తీసుకురావటంతో.. ఇందులో నుంచి క్షేమంగా బయటపడేందుకు పన్నీర్ మినహా మరెవరూ కనిపించని పరిస్థితి. ముందుగా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ప్రకారం.. పన్నీర్ విలీనం ముచ్చటను తెర మీదకు తీసుకురావటంతో తమిళ రాజకీయం రసకందాయంలో పడింది.

చిన్నమ్మను ఆమె పరివారాన్నిపార్టీ నుంచి బయటకు పంపిస్తే తప్పించి.. తాను కలిసేది లేదని పళని స్వామి టీంకు తేల్చి చెప్పిన పన్నీర్.. తాను అనుకున్నట్లే చేయగలిగారు. పార్టీకి సుప్రీంగా ఉన్న చిన్నమ్మను ఒక్క షాట్ లో పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకునేలా చేశారు. పన్నీర్ చెప్పిన మాట ప్రకారమే అంతా జరుగుతున్న వేళ.. చిన్నమ్మ అండ్ కో నిష్ర్కమణ సింఫుల్ గా సాగిపోయిన వేళ.. ఇరు వర్గాలు కలిసిపోయి విలీనం ఎపిసోడ్ ముగిసిపోతుందని భావించారు.

ఇలాంటి వేళలోనే పన్నీర్ మరో ట్విస్ట్ ను తెర మీదకు తీసుకొచ్చారు. తమ వర్గం కలవాలంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి పదవితో పాటు.. పార్టీకీ ప్రధాన కార్యదర్శి పదవి రెండూ ఇవ్వాలని చెప్పటంతో.. పళని వర్గం ఒక్కసారి షాక్ తింది.

ఊహించని రీతిలో పన్నీర్ పెడుతున్న షరతులకు ఒప్పుకుంటే.. మొదటికేమోసం వస్తుందన్న భావనలోకి వెళ్లిపోయింది. దీంతో.. విలీన ప్రక్రియ పూర్తి కావాల్సింది కాస్తా.. ప్రతిష్ఠంభన చోటు చేసుకుంది. పన్నీర్ రెండు డిమాండ్లకే పళనిస్వామి బ్యాచ్ కు పగలే చుక్కలు కనిపించిన వేళ.. అవి సరిపోవన్నట్లుగా.. ముచ్చటగా మూడో డిమాండ్‌ను తెర మీదకు తీసుకొచ్చారు పన్నీర్ బ్యాచ్. పోలింగ్ వాయిదా పడిన ఆర్కేనగర్ ఉప ఎన్నికకు ఫ్యూచర్ లోపార్టీ తరఫున తనకు సన్నిహితుడైన ఇ.మధుసూదనన్ ను అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబడుతున్నారు. ఇలా.. ఒకటి తర్వాత ఒకటిగాచెప్పుకుంటూ పోతున్న డిమాండ్లకు పళనిస్వామి వర్గం షాక్ తింటోంది. ఎంత అదృశ్యశక్తి అండదండలు ఉన్నా.. పన్నీర్ చెప్పే వాటన్నింటికి ఓకేచెప్పేస్తే.. తమకు మిగిలేదన్నది పళని వర్గీయుల ప్రశ్నగా మారింది. ప్రాధమికంగా తెర మీదకువచ్చిన డిమాండ్లకు ఓకే అంటే..రానున్న రోజుల్లో మరెన్ని డిమాండ్లు తెర మీదకు తెస్తారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దీంతో.. విలీన చర్చలు ఒక స్థాయిలో ముగియాల్సిన స్థానే.. ఇప్పుడు ప్రతిష్ఠంభన చోటు చేసుకుంది. మరి.. తాను అనుకున్నది సాధించే వరకూ పన్నీర్ ప్రయత్నిస్తారా? లేక.. రాజీ పడతారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/