ఫొటోషూటా? పార్లమెంటా? హీరోయిన్ పై ట్రోల్స్

Tue Jun 25 2019 12:35:33 GMT+0530 (IST)

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తరుఫున తాజా సార్వత్రిక ఎన్నికల్లో బసిర్హత్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచింది నుస్రత్ జహాన్. ఈ యంగ్ అండ్ అందమైన హీరోయిన్ సమీప బీజేపీ అభ్యర్థిపై 3 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందింది. అయితే పార్లమెంట్లో ప్రమాణం చేయని ఎంపీగా అపఖ్యాతి మూటగట్టుకుంది.బెంగాల్ లో నటిగా ఎంతో పేరుపొందిన ఈమెను బెంగాల్ సీఎం దీదీ ఎంపీగా నిలబెట్టి గెలిపించుకున్నారు. అయితే ఆమె ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే తేదీనాడే తన పెళ్లిని పెట్టుకుంది. టర్కీ దేశానికి చెందిన పారిశ్రామికవేత్త నిఖిల్ జైన్ తో ఎన్నో ఏళ్లుగా ఎఫైర్ నడిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ పెళ్లి పెట్టుకుంది. టర్కీలోనే అందమైన ప్రదేశంలో ఈ జంట ఒక్కటైంది. 

నిఖిల్ జైన్ తో వివాహం.. ఆ తర్వాత హనీమూన్ ఇతర కార్యక్రమాల కోసం విదేశాల్లోనే ఉండిపోయింది. తాజాగా ఆమె భర్తతో కలిసి ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.  తనను గెలిపించిన ప్రజల కోసం.. పార్లమెంట్ సంప్రదాయం ప్రకారమైనా   ఆమె కనీసం ఎంపీగా ప్రమాణం చేయకపోవడం దుమారం రేపింది. పెళ్లిరోజే పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండడంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇన్నిరోజులవుతున్నా ఆమె ఇండియాకు రాకపోవడం.. పైగా ఫొటో షూట్ లతో ఎంజాయ్ చేయడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.

నుస్రత్ జహాన్ ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని.. కనీసం ప్రమాణ స్వీకారం చేయరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ముస్లిం అయ్యి ఉండి హిందువును పెళ్లి చేసుకుంటావా అని మండిపడుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యమైన ఎంపీ చూడలేదని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందే పెళ్లి తేదీ ఖరారైందని.. ఫొటో షూట్ లు జరుపుకోవడంలో తప్పేంటని.. ఇందుకు హీరోయిన్ టార్గెట్ చేయడం ఏంటని నుస్రత్ బంధువులు మండిపడుతున్నారు.