Begin typing your search above and press return to search.

మోడీ హ‌యాంలో ఆ అల‌వాటు బాగా పెరిగిపోయింద‌ట‌!

By:  Tupaki Desk   |   25 Jun 2019 4:42 AM GMT
మోడీ హ‌యాంలో ఆ అల‌వాటు బాగా పెరిగిపోయింద‌ట‌!
X
జాతీయ బ్యాంకుల్లో ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగ్గొట్టే అల‌వాటుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తమ‌కు మించినోళ్లు లేర‌ని.. త‌మ మాదిరి పాల‌న ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికి చేత‌కాద‌న్న‌ట్లుగా మాట్లాడే తీరు బీజేపీ నేత‌ల్లోనూ.. వారిని అభిమానించే వారిలోనూ క‌నిపిస్తుంటుంది. మ‌రి.. అంత‌లా పాల‌న సాగితే..కొన్ని అల‌వాట్లు ఎందుకంత‌లా పెరిగిపోయాయి? అన్న సందేహం రాక మాన‌దు.

చ‌ట్టం క‌ఠినంగా అమ‌ల‌వుతున్న‌ప్పుడు.. త‌ప్పులు చేస్తే తాట తీసే స‌ర్కారు ఉంద‌న్న‌ప్పుడు నేరాలు చేసేందుకే వ‌ణుకుతారు. అలాంటిది మోడీ హ‌యాంలో షురూ అయిన 2014 త‌ర్వాత నుంచి బ్యాంకుల‌కు ఉద్దేశ పూర్వ‌కంగా ఎగ్గొట్టే అల‌వాటు ఎక్కువైంద‌న్న విష‌యాన్ని లోక్ స‌భ‌లో రాత‌పూర్వ‌క స‌మాధానంగా వెల్ల‌డి కావ‌టం విశేషం.

గ‌డిచిన ఐదేళ్ల కాలంలో జాతీయ బ్యాంకుల్లో ఉద్దేశ‌పూర్వ‌క ఎగ‌వేత‌దారుల సంఖ్య దాదాపు 60 శాతం పెరిగిన విష‌యాన్ని కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించ‌టం గ‌మ‌నార్హం.

2014-15 ఆర్థిక సంవ‌త్స‌రం ముగిసే నాటికి బ్యాంకుల్లో ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగ్గొట్టే వారి సంఖ్య 5349 ఉంద‌ని.. బ్యాంకుల నుంచి తీసుకునే అప్పు చెల్లించే స్థితి ఉన్న‌ప్ప‌టికీ చెల్లించ‌ని సంస్థ‌లు.. వ్య‌క్తుల‌ను ఉద్దేశ పూర్వ‌క ఎగ‌వేత‌దారులుగా చెబుతారు. అలాంటివారి సంఖ్య మోడీ ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌ర్వాత తొలి మూడేళ్ల‌లో (2015-16 నుంచి 2017-18 మ‌ధ్య కాలంలో) వ‌రుస‌గా 6575 - 7079 - 7535గా పెరిగిన‌ట్లు చెప్పారు.

గ‌డిచిన ఐదేళ్ల‌లో అలా ఎగ్గొట్టిన వారి ఖాతాల నుంచి రూ.7654 కోట్లు రిక‌వ‌రీ చేసిన‌ట్లుగా నిర్మ‌లా ప్ర‌క‌టించారు. ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎగ‌వేత వేసే వారి మీద చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు చెప్పారు. అదే విధంగా బ్యాంకు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించ‌కుండా విదేశాల‌కు పారిపోయిన వారికి కొత్త చ‌ట్టాన్ని తెచ్చిన‌ట్లు తెలిపారు.

ఎన్ని చేసినా.. మోడీ లాంటి స‌మ‌ర్థ ప్ర‌ధాని నేతృత్వంలోని ప్ర‌భుత్వంలో బ్యాంకుల‌కు చిల్లు పెట్టే ధైర్యం ఎలా వ‌స్తోంది? అన్న‌ది ప్ర‌శ్న‌. 2014 త‌ర్వాత నుంచే బ్యాంకుల‌కు ఎగ్గొట్టే అల‌వాటు ఎక్కువ కావ‌టం మోడీ స‌ర్కారు వైఫ‌ల్యం కాదా? అన్న క్వ‌శ్చ‌న్ కు స‌మాధానం రాని ప‌రిస్థితి. మొన‌గాడి లాంటి ప్ర‌భుత్వంగా గొప్ప‌లు చెప్పుకునే మోడీ హ‌యాంలో దేశంలో ఎలాంటి కొత్త అల‌వాటు ఎంత‌లా పెరిగింద‌న్న విష‌యం లోక్ స‌భ సాక్షిగా వెల్ల‌డైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.