Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ కాదు...వెంక‌య్య ఆవిష్క‌రించారు!

By:  Tupaki Desk   |   23 Nov 2017 5:50 PM GMT
ప‌వ‌న్ కాదు...వెంక‌య్య ఆవిష్క‌రించారు!
X
ప్ర‌స్తుతం వెబ్ మీడియాలో `తెలుగు` వెబ్ సైట్లు, యూట్యూబ్ చానెళ్లు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌నానంత‌రం రెండు తెలుగు రాష్ట్రాల్లో పుట్ట‌గొడుగుల్లా వెబ్ సైట్లు పుట్టుకు వ‌చ్చాయంటే అతిశ‌యోక్తి కాదు. ఆ వెబ్ సైట్ల‌లో ప‌బ్లిష్ అయిన సినీ, రాజ‌కీయ వార్త‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా స‌ర్క్యులేట్ అవుతుంటాయి. అయితే, వెబ్ మీడియాలో వ‌చ్చిన కొన్ని వార్త‌ల క్రెడిబిలిటీపై జ‌నాల‌కు న‌మ్మ‌కం ఉండ‌దు. ఓ ర‌కంగా చెప్పాలంటే కొన్ని వెబ్ సైట్ల‌లో వ‌చ్చే వార్త‌లను జ‌నం గాసిప్స్ లా చ‌దివి వ‌దిలేస్తారు. ఆ వార్త‌ల్లో ఏది రియ‌ల్‌? ఏది వైర‌ల్? అన్న‌ది అర్థం కాని ప‌రిస్థితి. కొన్ని వెబ్ సైట్లు - యూట్యూబ్ చానెళ్లలో ప‌బ్లిష్ అయ్యే వార్త‌లపై వాటి నిర్వాహ‌కులు క‌నీస ప‌రిశీల‌న కూడా చేయ‌క‌పోవ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. అయితే, అంద‌రు నిర్వాహ‌కులు ఇదేవిధంగా చేయ‌డం లేదు. త‌మ‌కంటూ గుర్తింపు తెచ్చుకొని విశేష పాఠ‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ప్ర‌ముఖ దిన ప‌త్రిక‌లు నిర్వ‌హిస్తున్న వెబ్ సైట్ల‌కు దీటుగా ఆస‌క్తిక‌ర‌మైన‌ వార్త‌లు-విశ్లేష‌ణ‌లు-క‌థ‌నాలు అందించే వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. ఏదో, ఒక‌టి లేదా రెండు సంద‌ర్భాల్లో కొన్ని వెబ్ సైట్లు ధ్రువీక‌రించ‌కుండా స‌మాచారాన్ని ప‌బ్లిష్ చేయ‌డం స‌హ‌జం. అయితే, దాదాపుగా 20 వ‌ర‌కు వెబ్ సైట్లు - యూట్యూబ్ చానెళ్లు ఒక వార్త‌ను ఒకేసారి పొర‌పాటుగా ప్ర‌చురించ‌డం ఆలోచించాల్సిన విష‌య‌మే. అది కూడా ఉప రాష్ట్రప‌తి ముఖ్య అతిథిగా హాజ‌రైన కార్య‌క్ర‌మం విష‌యంలో పొర‌బ‌డడం గ‌మ‌నార్హం. గ‌త నెల‌లో ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా ఒక పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. రెండు రోజుల క్రితం సద‌రు ర‌చ‌యిత ఆ పుస్త‌కం కాపీని ఒక సెల‌బ్రిటీకి అంద‌జేశారు. ఇంకేముంది, ఆ సెల‌బ్రిటీ చేతుల మీదుగా ఆ పుస్త‌కం విడుద‌లైన‌ట్లుగా వెబ్ సైట్లు - యూట్యూబ్ చానెళ్ల‌లో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. దీంతో, ఆ ర‌చ‌యిత స్వ‌యంగా వ‌చ్చి పుస్త‌కావిష్క‌ర‌ణ‌పై క్లారిటీ ఇవ్వ‌వ‌ల‌సిన ప‌రిస్థితి వ‌చ్చింది.


అక్కినేని గొప్పతనాన్నీ, నాటి తెలుగు సినిమా వైభవానికి అద్దం ప‌ట్టేలా `మ‌న అక్కినేని` అనే పుస్త‌కాన్ని ప్ర‌ముఖ సినీ ప‌రిశోధ‌కుడు సంజ‌య్ కిషోర్ ర‌చించారు. వృత్తిపరంగా - వ్యక్తిగతంగా నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఆ పుస్తకంలో పొందుప‌రిచారు. ఈ ఏడాది అక్టోబ‌రు 4 వ తేదీన విజ‌య‌వాడ‌లోని స్వ‌ర్ణ భార‌తి ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఉప రాష్ట్రప‌తి ఎం. వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా ఆ పుస్త‌కావిష్క‌ర‌ణ జ‌రిగింది. అక్కినేని గురించి అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు శోధించి ఆ పుస్త‌కాన్ని ర‌చించినందుకు సంజ‌య్ ను వెంక‌య్య అభినందించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, కొద్దిరోజుల క్రితం `అజ్ఞాత వాసి` సెట్ కు వెళ్లిన సంజ‌య్‌....`మ‌న అక్కినేని` పుస్త‌కాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కు అంద‌జేశారు. ఆ స‌మ‌యంలో త‌నికెళ్ల భ‌ర‌ణి - ప‌వ‌న్‌ - త్రివిక్ర‌మ్ ల‌తో సంజ‌య్ కొద్ది సేపు ముచ్చ‌టించారు. ఆ ఫొటోలు కాస్తా లీక్ అవ్వ‌డంతో, ఆ పుస్త‌కాన్ని ప‌వ‌న్ చేతుల మీదుగా విడుద‌ల చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చేశాయ్‌. అక్కినేని పుస్త‌కాన్ని ప‌వ‌న్ విడుద‌ల చేయడం....అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని కొన్ని వెబ్ సైట్లు వార్త‌లు రాయ‌గా, మ‌రికొన్ని ఫొటో రైట‌ప్ ల‌తో స‌రిపెట్టాయి. ఒక వెబ్ సైట్లో వ‌చ్చిన వార్త‌....కొద్దిపాటి మార్పుల‌తో అన్ని వెబ్ సైట్ల‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ నోట ఈ నోట ప‌డి ఈ విష‌యం సంజ‌య్ కిషోర్ కు చేరింది. దీంతో, ఆయ‌న అస‌లు విష‌యం పై క్లారిటీ ఇచ్చారు. అదండీ అస‌లు సంగ‌తి.

అయితే, ఒక్క ప్రింట్ మీడియాకు మిన‌హాయిస్తే ఎల‌క్ట్రానిక్‌, వెబ్ మీడియాల‌కు..... ప్రేక్ష‌కుల‌కు, పాఠ‌కుల‌కు ఎంత వేగంగా వార్త‌లను అందించామ‌న్న‌దే ప్ర‌ధానం. ఆ వేగాన్ని అందుకొని రేసులో ముందుకు వెళ్లే క్ర‌మంలో కొన్నిసార్లు ఇటువంటి పొర‌పాట్లు జ‌రుగుతుంటాయి. అయితే, కొన్ని వెబ్ సైట్లు క‌నీస ప‌రిశీల‌న చేయ‌డం ద్వారా ఇటువంటి పొరపాట్లు జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌చ్చనేది విశ్లేష‌కుల అభిప్రాయం. భ‌విష్యత్తులో ప్రింట్ - ఎల‌క్ట్రానిక్ మీడియాల‌కు వెబ్ మీడియా నుంచి గట్టి పోటీ ఎదుర‌వుతుంద‌నే భావ‌న చాలామందికి ఉంది. అయితే, వేగంతో పాటు విశ్వ‌స‌నీయ‌త‌ను సంపాదించుకున్న‌పుడే వెబ్ మీడియాకు అది సాధ్య‌ప‌డుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ధ‌నార్జ‌న‌తో పాటు ప్ర‌జాద‌ర‌ణ పొందిన‌పుడే ఆ కొన్ని వెబ్ సైట్లు మ‌నుగ‌డ సాగించ‌గలుగుతాయి.