ప్రజారాజ్యంతో జనసేనను పోలికే పెట్టలేం!

Sat May 25 2019 11:03:57 GMT+0530 (IST)

ఏపీ ఎన్నికల్లో కీలకభూమిక పోషించే అవకాశం ఉందన్న జనసేన అంచనాలకు భిన్నంగా ఏపీ ఓటర్లు తాజా ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని చెప్పాలి. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు తాజాగా వెలువడిన సంగతి తెలిసిందే. దారుణమైన వైఫల్యాన్ని మూటకట్టుకున్న జనసేన వర్గాలు తమకు వచ్చిన ఫలితాలతో నివ్వెరపోతున్నట్లుగా తెలిసింది. తాజాగా వెలువడిన ఫలితాల్ని చూసిన పవన్ అండ్ కో అవాక్కు అయిన పరిస్థితి.ఆసక్తికరమైన విషయం ఏమంటే.. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీతోనూ జనసేనను పోల్చలేని పరిస్థితి. ఇందుకు ఆ పార్టీ సాధించిన ఓట్లే నిదర్శనంగా చెబుతున్నారు. ఏపీ మొత్తంలో 3.13 కోట్ల ఓట్లు పోలైతే.. జనసేనకు కేవలం 21 లక్షల ఓట్లు మాత్రమే  నమోదు కావటం గమనార్హం.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ 21 లక్షల ఓట్లలో వచ్చివన్నీ ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఇబ్బంది కలిగించే మరో అంశం ఏమంటే.. రెండు గోదావరి జిల్లాల్ని మినహాయిస్తే ఏపీలోని 11 జిల్లాల్లో జనసేనకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ కావటం గమనార్హం.

2009 ఎన్నికల్లో  ప్రజారాజ్యం పార్టీ విశాఖ జిల్లా పెందుర్తి..తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం.. పిఠాపురం నియోజకవర్గాల్లో గెలిచింది. తాజా ఎన్నికల్లో ఈ స్థానాల్లో పోటీ చేసిన జనసేన కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేదు. ప్రజా రాజ్యం పార్టీ 13 జిల్లాల్లో మొత్తంగా 16 నియోజకవర్గాల్లో గెలిచింది. మరో 34 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. తాజా ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో మాత్రమే గెలిచింది.

మూడు స్థానాల్లో మాత్రమే రెండో స్థానంలో నిలిచింది. వాటిల్లో రెండు జనసేన అధినేత పవన్ పోటీ చేసిన భీమవరం.. గాజువాక స్థానాలు కావటం గమనార్హం. జనసేన వైఫల్యాన్ని సింఫుల్ గా ఒక్క పోలికతో చెప్పేయొచ్చు. ఏపీలో ఆ పార్టీ మొత్తం 136 స్థానాల్లో పోటీ చేస్తే 120 స్థానాల్లో జనసేన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన దుస్థితి. ఇదొక్కటి చాలు ఏపీలో జనసేన ఎంత ప్రభావం చూపిందో తెలుసుకోవటానికి.