Begin typing your search above and press return to search.

ఉత్తరాధిపత్యం.. దక్షిణాభిజాత్యం

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:30 PM GMT
ఉత్తరాధిపత్యం.. దక్షిణాభిజాత్యం
X
తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును గౌరవించని కేంద్రాన్ని దుయ్యబెడుతూ తమిళుల ఉద్యమం ఓ వైపు... అదే స్ఫూర్తితో ఏపీ ప్రత్యేకహోదా అంశంపై మరోసారి ఉద్యమం ఇంకోవైపు.. వెరసి దక్షిణ భారతం ఉద్యమాల బాట పడుతోంది. ఈ ఉద్య మాలు పార్టీలు - రాజకీయ ప్రయోజనాలకతీతంగా తమ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగుతున్నాయి. ఈ ఉద్యమాలన్నీ కేంద్రంలోని ఉత్తరాది నాయకత్వం తమ ఆత్మగౌరవాన్ని గుర్తించడం లదేన్న వాదనను తెరపైకితెచ్చాయి. కేంద్రస్థాయిలోని ఉత్తరాది నాయకత్వాన్ని తాము వ్యక్తిగతంగా గౌరవించినప్పటికీ దక్షిణాదిపై జులుం సహించేదిలేదన్న స్థాయికి ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలొచ్చేశాయి. అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని ఉత్తరాది ఆధిపత్యానికి గండికొట్టే వరకు సాగే సూచనలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వింధ్య పర్వతాల పైనున్న ఉత్తరాదికి చెందిన పాలకులు - నాయకులు దేశాన్ని దశాబ్దాలుగా ఏలుతున్నారు. పీవీ నరసింహరావు - దేవెగౌడ వంటివారిని మినహాయిస్తే మిగతాదంతా ఉత్తరాది పాలనే... కానీ.. వారి శకం ముగిసి దశాబ్దాలు గడిచాయి. దక్షిణ భారత నేతలు చిన్నోళ్లేం కారు.. కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పరచడం నుంచి.. దేశంలో రాజకీయ సంక్షోభాలను చక్యబెట్టి స్థిరత్వం తేవడం వరకు ప్రతి అంకంలోనూ కీలక పాత్ర పోషించిన నేతలున్నారు. ఇంకా చెప్పాలంటే... రాష్ట్రాల్లో హోల్ అండ్ సోల్ గా తిరుగులేని ఆధిపత్యం చెలాయించే నేతలున్న ప్రాంతం దక్షిణాది మాత్రమే. దివంగత జయలలిత కావొచ్చు.. దివంగత సీఎం వైఎస్ ఆర్ కావొచ్చు.. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు - కేసీఆర్ లు కావొచ్చు - ఆయా రాష్ట్రాల్లో వారికున్న ఇమేజితో పోల్చితే ఉత్తరాది రాష్ట్రాల సీఎంలు - ఇతర నేతలకున్న డామినేషన్ - పాపులారిటీ పూచిక పుల్లే. కానీ... కేంద్రంలో అధికారం మాత్రం దశాబ్దాలుగా ఉత్తరాది నేతల అబ్బ సొత్తుగానే ఉంది. ఒక్క మోడీ మాత్రం దానికి మినహాయింపు. గుజరాత్ సీఎంగా ఆయన దక్షిణాది నేతలకు తలదన్నే స్థాయి ఇమేజిని సొంతం చేసుకుని భారత దేశ అధికార పీఠాన్ని అందుకున్నారు.

దక్షిణాది నేతలకు అంత హెవీ ఇమేజి ఉన్నా కూడా గతకొంతకాలంగా దక్షిణాదికి తగిన ప్రాముఖ్యత దక్కడం లేదు. స్వతంత్రమొచ్చిన తొలినాళ్ళలో కీలకపదవుల్ని కొన్నిం టిని విధిగా దక్షిణాదికి కట్టబెట్టేవారు. స్వతంత్ర పోరాట సమయంలో కాంగ్రెస్‌ కూడా అధ్యక్ష స్థానాన్ని ఉత్తరాదికి, దక్షిణాదికి మార్చి మార్చి అప్పగించింది. తద్వారా సమతు ల్యత దెబ్బతినకుండా కాపాడేది. సొంత పాలనలో కొంత కాలం ఈ విధానం అమలైంది. ప్రధానిగా ఉత్తరాది నేతలున్న సమయంలో దేశాధ్యక్ష పదవిని దక్షిణాదికి కట్టబెట్టారు. ఒక్కో సందర్భంలో ఉత్తరాదికి చెందిన అధ్యక్షుడుంటే ఉపాధ్యక్షు డిగా దక్షిణాదికి చెందిన వ్యక్తికి అవకాశం కల్పించేవారు. అలాగే లోక్‌ సభ స్పీకర్‌ - రాజ్యసభ చైర్మన్‌ వంటి కీలకపదవుల్లో కొన్నింటిని దక్షిణాదికి కట్టబెట్టేవారు. ఇలా ఇరు ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించేవారు.

అయినప్పటికీ గతంలో కొన్ని సందర్భాల్లో దేశంలో అంతర్గత వివాదాలు రాజుకున్నాయి. తమిళనాట ద్రవిడ ఉద్యమం బలపడింది. ఇది ప్రధానంగా హిందీవ్యతిరేకతపైనే ఆధారపడింది. ఉత్త రాది నాయకత్వం తమను రాజకీయంగా, సామాజికంగా అణగదొక్కేస్తోందన్న ఆక్రోశం నుంచే ఈ ఉద్యమం పుట్టింది. చివరకు తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి హిందీని, ఉత్తరాదికి చెందిన నాయకత్వాన్ని గెంటేసేవరకు ఇది సాగింది. అప్పట్లో ఈ ఉద్యమ ప్రభావం దక్షిణాది మొత్తం విస్తరించకుండా కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకుంది. తిరిగి దక్షిణాదికి ప్రాతినిథ్యం పెంచింది.

ఏ జాతి లేదా ప్రాంతం వివక్షతకు గురవుతోందన్న భావనలో ఉన్నప్పుడల్లా ఉద్యమాలు రూపుదిద్దుకుంటాయి. తమ సంస్కృతి, సంప్రదాయాల్ని కేంద్రం మంట గలిపేస్తోందన్న ఆక్రోశంతోనే సిక్కులు ఏకంగా ప్రత్యేక దేశం కోసం పోరాటం సల్పారు. భారత్‌ నుంచి విడిపోయేందు క్కూడా సంసిద్దులయ్యారు. ఆ మాటకొస్తే ఇప్పుడే కాదు.. చారిత్రక, పౌరాణిక కాలం నుంచి కూడా దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం కొనసాగింది. ఉత్తరాదికి చెందిన పలువురు రాజులు, చక్రవర్తులు రాజ్యకాంక్షతో దక్షిణాది సంస్థానాలు, రాజ్యాలపై దాడులు చేశారు. యుద్దాలు జరిపారు. వీటిని హస్తగతం చేసుకున్నారు. దక్షిణాది నుంచి ఏ ఒక్కరాజు ఉత్తరాదికెళ్ళిన చరిత్రల్లేవు.

రాముడి కాలం నుంచి ఉత్తరాది వారే దక్షిణాదిమీదుగా ఆధిపత్యం చెలాయించారు. మొగలాయిలు కూడా ఉత్తరాది నుంచొచ్చి దక్షిణప్రాంతంపై పట్టుసాధించారు. ఆఖరకు బ్రిటీష్ వారు కూడా తూర్పు ప్రాంతమైన కలకత్తా మీదుగానే దక్షిణాదిని ఆక్రమించుకున్నారు. స్వతంత్ర పోరాట సమయంలో చిన్న చిన్న సంస్థానాలు - రాజ్యాలకు చెందిన ప్రజలంతా భారతీయులమన్న ఏకైక భావనను రూపొందిచుకోగలిగారు. స్వతంత్రానంతరం ఇదే భావన బలిష్టమైన దేశ పురోగతికి దోహదపడుతుంది. అయితే అబ్దుల్‌ కలామ్‌ తర్వాత దక్షిణాదికి చెందిన ఎవరికీ కేంద్రంలో తగిన ప్రాధాన్యతలభించలేదు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉండగా ప్రతిభాపాటిల్‌ అధ్యక్షురాలిగా హమిద్‌ అన్సారీ ఉపాధ్యక్షుడిగా, మీరాకుమార్‌ లోక్‌ సభ స్పీకర్‌ గా వ్యవహరిం చారు. ఆ తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతుందే తప్ప దక్షిణాది ప్రాబల్యం ఏమాత్ర కనిపించడం లేదు. ఉత్తరాదికి చెందిన మోడి ప్రధానిగా ఉంటే తూర్పు భారతానికి చెందిన ప్రణబ్‌ముఖర్జీ అధ్యక్షునిగా, ఉత్తరాదికే చెందిన అన్సారీ ఉపాధ్యక్షునిగా, సుమిత్రామహజన్‌ లోక్‌ సభ స్పీకర్‌ గా వ్యవహరిస్తున్నారు. ఇతర కీలకపదవు ల్లోనూ ఉత్తరాదివారే ఉన్నారు. సైన్యంలోని కీలకపదవు ల్లోనూ ఉత్తరాదివారే ఉన్నారు. దీంతో దక్షిణాదికి తగిన ప్రాతినిద్యం కొర వడింది. ఈ ప్రభావం దక్షిణాది ప్రయోజనాలపై దెబ్బకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌ కు హోదా విషయంలో ఇది మరింత స్పష్టంగా బయటపడింది.

ఇదే పరిస్థితులు కొనసాగితే రాన్రాను ఉత్తర, దక్షిణ భారతాల మధ్య విబేధాలు విద్వేషాల స్థాయికి చేరే ప్రమాదముందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికైనా రెండు ప్రాంతాల మధ్య సమతుల్యతను పాటించాల్సిన ఆవశ్యకతుందని సూచిస్తున్నారు. స్థూల ఉత్పత్తిలో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది వేగంగా అభివృద్ది చెందుతోంది. అలాగే తలసరి ఆదాయ సాధనలోనూ ఉత్తరాదికంటే దక్షిణాది అగ్రగామిగా ఉంది. అభివృద్దిలోనూ దక్షిణాది ముందంజలో ఉంది. అయినా సరే రాజకీయ ప్రాతినిథ్యం విషయంలో దక్షిణాదిని ఉత్తరాది నాయకులు అణగదొక్కే స్తున్నారు. పార్లమెంట్‌లో ఉత్తరాదికి అత్యధిక సీట్లుండడంతో ఈ ప్రయోజనాల్ని వారే పూర్తిగా పొందుతున్నారు. సమతుల్యత లోపిస్తే దక్షిణాది కి ప్రత్యేక దేశం కావాలన్న ఉద్యమాలు ఆవిర్భవించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వీరు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మధ్యలో ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం పూర్తవుతుంది. ఆ తర్వాత అధ్యక్షస్థానానికైనా దక్షిణాది ప్రముఖుల్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ వ్యత్యాసాలు కొంతలో కొంతైనా తగ్గే అవకాశముంటుందని సూచిస్తున్నారు.

- గరుడ