Begin typing your search above and press return to search.

ట్రంప్‌ హెచ్చరికలు.. కుక్క అరుపులే!

By:  Tupaki Desk   |   22 Sep 2017 4:16 AM GMT
ట్రంప్‌ హెచ్చరికలు.. కుక్క అరుపులే!
X
ఒక్క మాట‌లో చెప్పాలంటే...ఇది మొండి - మూర్ఖుల మ‌ధ్య మాటల యుద్ధం. త‌మ దూకుడుతో ప్ర‌పంచానికి శాపంగా మారిన నాయ‌కుల ర‌చ్చ. ఆ ఇద్ద‌రు దేశాధినేత‌లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ - ఉత్త‌ర‌కొరియా ర‌థ‌సార‌థి కిమ్ జోంగ్ ఉన్‌. ఇన్నాళ్లు దౌత్య‌ప‌ర‌మైన వాదోప‌వాదాలు సాగిన ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య ఇప్పుడు బూతులు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఉత్త‌కొరియా ఇటీవల వరుసగా అణ్వాయుధ పరీక్షలు - క్షిపణీ ప్రయోగాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించిన డొనాల్డ్‌ ట్రంప్‌.. ఉత్తర కొరియాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అమెరికాపైగానీ - తన మిత్రదేశాలపైగానీ దాడిచేస్తే.. కొరియాను సమూలంగా నాశనం చేస్తానని హెచ్చరించారు.

అయితే ఉత్తర కొరియాను సమూలంగా నాశనం చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన భీకర హెచ్చరికను.. ఆ దేశం తేలికగా కొట్టిపారేసింది. ట్రంప్‌ హెచ్చరికలను కుక్క అరుపులతో పోల్చి ఎద్దేవా చేసింది. ఈ బెదిరింపులకు ఉత్తరకొరియా లొంగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.ఐరాస సమావేశాల్లో పాల్గొనడానికి న్యూయార్క్‌ వచ్చిన ఉ.కొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్‌ హోను ట్రంప్‌ హెచ్చరికలపై విలేకరులు ప్రశ్నించగా.. ఒక సామెతతో బదులిచ్చారు. ``ఏనుగుల ఊరేగింపు సాగుతుంటే.. కుక్కలు మొరుగుతాయి`` అని యాంగ్‌ పేర్కొన్నారు. కుక్క అరుపులతో వారు మమ్మల్ని బెదిరించాలని చూస్తే.. అది శునకస్వప్నమే అవుతుంది అని ఎద్దేవా చేశారు. దీంతో వాదోప‌వాదాలు కాస్త మ‌రింత‌గా స్థాయిని దిగ‌జార్చుకున్న‌ట్లు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

మ‌రోవైపు ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొట్టమొదటిసారిగా చేసిన ప్రసంగంపై పలువురు నేతలు విమర్శల వర్షం కురిపించారు. ట్రంప్‌ చేసిన విద్వేష ప్రసంగం మధ్య యుగాల నాటికి చెందినట్లుగా వుందని, అంతేకానీ 21వ శతాబ్దంలో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించినట్లు లేదని ఇరాన్‌ విదేశాంగ మంత్రి తీవ్రంగా విమర్శించారు. ట్రంప్‌ తన ప్రసంగంలో వెనిజులాను లక్ష్యంగా చేసుకుని ఘాటైన విమర్శలు చేస్తూ, అక్కడ వున్నది సోషలిస్టు నియంతృత్వ ప్రభుత్వమని, ఆ దేశంపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను వెనిజులా విదేశాంగ మంత్రి జార్జి అరెజా తీవ్రంగా ఖండించారు. ట్రంప్‌ బెదిరింపులను పట్టించుకోబోమని, ట్రంప్‌ ప్రపంచానికి అధ్యక్షుడేమీ కాదని, ఆయన తమ ప్రభుత్వాన్నే దిద్దుకోలేకపోతున్నాడని విమర్శించారు. బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్‌ ట్వీట్‌ చేస్తూ, ట్రంప్‌ వంటి కోటీశ్వరుడు సోషలిజంపై ఇలా విమర్శలు చేయగం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదన్నారు.