Begin typing your search above and press return to search.

ఒలింపిక్ ప‌త‌కం గెల‌వలేద‌ని శిక్ష‌లు

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:54 PM GMT
ఒలింపిక్ ప‌త‌కం గెల‌వలేద‌ని శిక్ష‌లు
X
ఒలింపిక్స్ లో ప‌త‌కం సాధించినందుకు న‌జ‌రానాలు ప్ర‌క‌టించ‌డం.. స‌న్మానాలు చేయ‌డం.. మామూలే. మ‌రి ప‌త‌కాలు సాధించ‌ని వారికి శిక్ష‌లు విధించ‌డం ఎక్క‌డైనా చూశారా..? ఈ చిత్రం ఉత్త‌ర కొరియాలో చోటు చేసుకోబోతోంది. ఆ దేశాన్ని పాలించే నియంత కిమ్ జాంగ్ అరాచ‌కాల‌కు తాజా ఉదాహ‌ర‌ణ ఇది. గ‌తంలో ఫుట్ బాల్ ప్ర‌పంచ‌క‌ప్ లో విఫ‌ల‌మైనందుకు గాను త‌మ దేశ క్రీడాకారుల్ని నిల‌బెట్టి తీవ్ర దూష‌ణ‌ల‌కు దిగ‌డంతో పాటు వారిని అనేక అవ‌మానాల‌కు గురి చేసిన కిమ్.. తాజాగా ఒలింపిక్స్ లో ప‌త‌కం గెల‌వ‌డంలో విఫ‌ల‌మైన అథ్లెట్ల విష‌యంలోనూ త‌న శాడిజం చూపిస్తున్నాడు.

ప‌త‌కాలు గెల‌వ‌లేక‌పోయిన క్రీడాకారుల‌కు ఇల్లు లేకుండా చేయ‌డమే కాక‌.. వారికి స‌రైన తిండి కూడా దొర‌క్కుండా చేయ‌బోతున్నాడ‌ట‌. అంతే కాక కొంద‌రిని బొగ్గు గ‌నుల్లో ప‌ని చేసేలా కూడా శిక్ష విధిస్తున్నాడ‌ట‌. మ‌రోవైపు ప‌త‌కాలు గెలిచిన వాళ్లకు మాత్రం భారీ న‌జ‌రానాలే ఇవ్వ‌నున్నాడు కిమ్. వారికి ఖ‌రీదైన బంగ్లాలు.. కార్ల‌తో పాటు అనేక బ‌హుమ‌తులు సిద్ధంగా ఉన్నాయి. రియో ఒలింపిక్స్ లో ఉత్త‌ర కొరియా క్రీడాకారులు 7 ప‌త‌కాలు సాధించారు. ఆ ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల కిమ్ సంతృప్తిగా లేడు. పాల‌న విష‌యంలో ప్ర‌పంచాన్ని అనుస‌రించ‌కుండా.. నియంతృత్వాన్ని కొన‌సాగిస్తున్న కిమ్.. ప్ర‌జాస్వామ్య దేశాలు పోటీ ప‌డే ఒలింపిక్స్ లో ప‌త‌కాలు గెల‌వ‌డాన్ని అంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డం.. మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌ని క్రీడాకారుల్ని శిక్షించ‌డం ఏం న్యాయ‌మో అత‌డికే తెలియాలి.