బాబు మార్కు పాలనకు... ఇది పరాకాష్టే!

Fri Mar 17 2017 11:51:05 GMT+0530 (IST)

మొన్న కృష్ణా జిల్లాలో 11 మంది ప్రాణాలను బలిగొన్న దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఏపీలో రాజకీయ ప్రకంపనాలనే రేపింది. సాక్షాత్తు ప్రతిపక్ష నేత హోదాలో ప్రమాదంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేసినా కూడా... ఆ ఘటనపై ఇప్పటిదాకా అసలు కేసే నమోదు కాలేదట. డ్రైవర్ మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రవాణా శాఖ అధికారుల విచారణ తేల్చేసినా... ట్రావెల్స్ యాజమాన్యంపై కేసులు నమోదు కాలేదు. ఇంత పెద్ద ప్రమాదాన్ని కేసులే లేకుండా వదిలేసిన బాబు సర్కారు... ఆ ప్రమాదం జరిగిన మరునాడు ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఈ చిన్న ప్రమాదంపై మాత్రం చాలా ఘాటుగానే కాకుండా... కఠిన చర్యలు తీసుకునే దిశగా  వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఈ వ్యవహారం వివరాల్లోకెళితే... నందిగామ సమీపంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగిన మరునాడు ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో ఓ లోకల్ ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విజ్ఞాన యాత్రకు వెళ్లి వస్తున్న ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలు కాగా... మరో పది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకోగా... రవాణా శాఖ మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావు అక్కడికి పరుగులు పెట్టారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శిద్దా... మొత్తం ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రిగారి ఆదేశాలతో రంగంలోకి దిగిన రవాణా శాఖ అధికారులు ప్రమాదానికి గల కారణాలను తేల్చారో?  లేదో?  తెలియదు గానీ... ఆ బస్సులో విద్యార్థులను విజ్ఞానయాత్రకు తీసుకెళ్లిన ఉపాధ్యాయులతో పాటు అందుకు అనుమతి మంజూరు చేసిన ప్రధానోపాధ్యాయుడిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఇదేంటీ... ప్రమాదం ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కారణంగా జరిగితే... విద్యార్థులను విజ్ఞానయాత్రకు తీసుకెళ్లిన టీచర్లపై కేసులు ఎందుకు పెట్టారంటే... చంద్రబాబు పాలనలో ఇలా జరగడం మామూలేనన్న వాదన వినిపిస్తోంది.

ఇక్కడ మరో ఆసక్తికర అంశాన్ని కూడా ప్రస్తావించాలి. అదేంటంటే... విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లాలని అందుకు అవసరమయ్యే నిధులు కూడా ఇచ్చిన వారెవరో కాదు.. చంద్రబాబు సర్కారే. ప్రభుత్వ ఆదేశాలు నిధుల విడుదలతోనే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను కర్నూలు జిల్లాలోని బెలూం గుహలు - యాగంటి - మహానంది క్షేత్రాలను చూపించేందుకు తీసుకెళ్లారు. పర్యటన పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మరికాసేపట్లో గమ్యం చేరుకుంటామన్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రాణాలను బలి తీసుకున్న దివాకర్ ట్రావెల్స్ ప్రమాదాన్ని గాలికి వదిలేసి... చిన్న ప్రమాదమైన కనిగిరి యాక్సిడెంట్ పై వేగంగా స్పందించడమే కాకుండా... ప్రమాదానికి కారకులను వదిలేసి విద్యార్థులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్లిన టీచర్లపై కేసులు నమోదు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఉపాద్యాయ సంఘాలు బాబు సర్కారు దమన నీతిని ఎండగట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరి ఉపాధ్యాయ సంఘాలకు బాబు అండ్ కో ఏం చెప్పి సముదాయిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/