Begin typing your search above and press return to search.

లిక్కర్ కింగ్ బ్రాండ్ కొనే నాథుడే లేడు

By:  Tupaki Desk   |   30 April 2016 11:35 AM GMT
లిక్కర్ కింగ్ బ్రాండ్ కొనే నాథుడే లేడు
X
బ్యాంకులకు పంగనామాలు పెట్టి దాదాపు రూ.9వేల కోట్ల వరకు బాకీ పడి.. గుట్టుచప్పుడు కాకుండా దేశం విడిచి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఆస్తుల్ని అమ్మటం కష్టతరంగా మారింది. మాల్యాకు చెందిన ఆస్తుల్ని గతంలో ఆన్ లైన్ వేలంపాటలో పెడితే.. ఒక్కరంటే ఒక్కరు కూడా కొనేందుకు ముందుకురాలేదు. తాజాగా అతగాడి బ్రాండ్ అయిన ‘‘కింగ్ ఫిషర్’’ను అమ్మేందుకు వేలంపాటను శనివారం నిర్వహించారు.

కింగ్ ఫిషర్ బ్రాండ్.. ట్రేడ్ మార్క్ లను శనివారం ఉదయం 11.30 గంటలకు వేలంపాట నిర్వహించగా.. దాదాపు గంటకు పైనే వెయిట్ చేసినా ఒక్కరంటే ఒక్కరు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. మాల్యాకు అప్పులిచ్చిన 17 మంది రుణదాతలు కలిసి ఈ వేలంపాటను నిర్వహించారు. మాల్యా కింగ్ ఫిషర్ బ్రాండ్ ను రూ.366.70కోట్లతో వేలంపాటను షురూ చేశారు. అయితే.. ఈ బ్రాండ్ ను కొనేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకురాలేదు.

ఇలాంటి పరిస్థితే గత నెలలోనూ చోటు చేసుకుంది. మాల్యాకు చెందిన ఇంటిని సైతం వేలంపాట నిర్వహించగా.. అందులోపాల్గొనేందుకు ఎవరూ ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో.. ఆ వేలంపాటను నిలిపివేశారు. తాజాగా కింగ్ ఫిషర్ బ్రాండ్ ను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవటం చూస్తే.. ఆస్తుల్ని.. బ్రాండ్లను.. ట్రేడ్ మార్కుల్ని తనఖా పెట్టుకొని అప్పులిచ్చిన బ్యాంకులకు ఇబ్బందులు మరింత పెరిగే పరిస్థితి.