Begin typing your search above and press return to search.

మీ ద‌గ్గ‌రి రూ.2వేల నోటు చిరిగితే..?

By:  Tupaki Desk   |   17 Jun 2018 5:35 AM GMT
మీ ద‌గ్గ‌రి రూ.2వేల నోటు చిరిగితే..?
X
ప్ర‌ధాని మోడీ పుణ్యమా అని రూ.2వేల నోటు చూస్తున్న ప‌రిస్థితి. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన మొన‌గాడు ప్ర‌ధానిగా పేరు సంపాదించుకున్న ఆయ‌న‌.. త‌క్కువ కాలంలో అదే అంశంపై ప్ర‌జ‌ల్లో తీవ్ర ప్ర‌తికూల‌త‌ను ఎదుర్కొంటున్నారు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించి.. అప్ప‌టికే చెల్లుబాటులో ఉన్న నోట్ల‌కు మించిన పెద్ద నోటును ప్ర‌వేశపెట్టిన మోడీ ఊహించ‌ని రీతిలో షాకిచ్చారు. పెద్ద‌నోటు అందుబాటులోకి వ‌చ్చిన వెంట‌నే చిల్ల‌ర స‌మ‌స్య భారీగా పెరిగింది. రూ.200 సామాన్లు కొన్న త‌ర్వాత రూ.2వేల నోటు ఇస్తే.. చిల్ల‌ర లేదన్న స‌మాధానంతో జ‌నం ఎంత‌గా త‌ల్ల‌డిల్లిపోయారో చెప్పాల్సిన ప‌నే లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పుడు రూ.2వేల నోటు చిరిగినా.. పాడైనా పెద్ద చిక్కుగా మార‌టం ఇబ్బంది పెడుతోంది. కొత్త రంగుల‌తో.. స‌రికొత్త భ‌ద్ర‌త‌తో..రూపం మారిన రెండు వేల నోటు ఓకే అయినా.. ఆ బుజ్జి నోటుకు ఏమైనా అయితే మాత్రం అంతే సంగ‌తులు చిత్త‌గించ‌వ‌లెను అన్న‌ట్లుగా ప‌రిస్థితులు ఉండ‌టంతో కొత్త స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇప్పుడు ప‌రిస్థితి ఎలా మారిందంటే.. రూ.2వేల నోటంటేనే బెదిరిపోయే ప‌రిస్థితి.

ఎందుకిలా ఉంటే.. రూ.2వేల నోటు చిరిగినా.. కాస్త పాడైనా తీసుకోవ‌టానికి ఎవ‌రూ ముందుకు రావ‌టం లేదు. బ్యాంకుల‌కు వెళితే స‌రిపోతుందంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. బ్యాంకుల్లో అయితే అస‌లు ద‌గ్గ‌ర‌కే రావ‌టం లేదు. ఎందుకిలా అంటే.. రూ.2వేల నోటు చిరిగినా.. పాడైనా ఏం చేయాల‌నే అంశంపై మార్గ‌ద‌ర్శ‌కాల్ని ప్ర‌భుత్వం సిద్ధం చేయ‌క‌పోవ‌టంతో ఈ ప‌రిస్థితి నెల‌కొంది. దాదాపు ఏడాదిన్న‌ర కాలమైంది రూ.2వేల నోటు వ‌చ్చి. దీంతో కొత్త నోట్లు కాస్తా ఇప్పుడిప్పుడే పాత‌బ‌డిపోతున్నాయి. కొంద‌రి ద‌గ్గ‌ర అయితే నోట్లు చిరుగుతున్నాయి. వీటిని వెన‌క్కి తీసుకోవ‌టానికి బ్యాంకులు అంగీక‌రించ‌టం లేదు.

వెయ్యి రూపాయిల నోటు వ‌ర‌కూ పాడైనా.. చినిగినా ఏం చేయొచ్చ‌న్న అంశం మీద బ్యాంకుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం ఉంది. అంత‌కు మించిన వాటికి అలాంటింది లేదు. దీంతో.. త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన పాడైన రూ.2వేల నోట్ల‌ను వెన‌క్కి తీసుకోవ‌టానికి బ్యాంకు అధికారులు నో చెప్పేస్తున్నారు. ద రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రిఫండ్‌) రూల్స్ 2009 ప్ర‌కారం నోట్లు చిరిగిపోయిన ప‌క్షంలో ఆ చినిగిన నోటులో పెద్ద భాగం ఎంత మేర ఉంటుంద‌న్న‌దానికి అనుగుణంగా దానికి విలువ ఇస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు రూ.50 నోటులో చినిగి భాగం క‌నీసం 70చ‌ద‌ర‌పు సెంటీమీట‌ర్ల ఉంటే పూర్తి మొత్తాన్ని బ్యాంకులు నోటు తెచ్చిన వ్య‌క్తికి వ‌వ్ఆల్సి ఉంటుంది.

అదే రీతిలో రూ.100.. రూ.500.. రూ.1000 నోట్ల‌కు వ‌రుస‌గా 75.. 80.. 84 చ‌ద‌ర‌పుసెంటీమీట‌ర్ల మేర ఉండాలి. అప్పుడే పూర్తి విలువ ద‌క్కుతుంది.ఈ పేర్కొన్న దాని కంటే త‌క్కువ ఉంటే మాత్రం నోటులో స‌గం విలువ మాత్ర‌మే బ్యాంకులు ఇస్తాయి. 2009లోని నిబంధ‌న‌ల ప్ర‌కారం అతి పెద్ద నోటు అంటే వెయ్యి వ‌ర‌కూ మాత్ర‌మే. మ‌రి.. రూ.2వేల నోటు మాటేమిటి? అంటే.. మా చేతుల్లో లేద‌ని చెబుతున్నారు. రూ.2వేల నోటును తీసుకొచ్చిన ప్ర‌భుత్వం ఆ నోటు చిరిగినా.. పాడైనా ఏం చేయాల‌నే దానిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌టం.. 2009 చ‌ట్టాన్ని మార్చ‌క‌పోవ‌టంతో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. రూ.2వేల నోటుతోనే కాదు.. మోడీ హ‌యాంలో చెలామ‌ణిలోకి వ‌చ్చిన రూ.200 నోటు కూడా ఇలాంటి ఇబ్బందే ఉంది. రూ.200 నోటు చిరిగినా.. పాడైనా ఏం చేయాల‌నే అంశంపై రూల్ బుక్ లో పేర్కొన‌క‌పోవ‌టంతో బ్యాంకులు ఆనోట్లు పాడైతే వెన‌క్కి తీసుకోవ‌టానికి ఒప్పుకోని ప‌రిస్థితి ఉంది. కొత్త నోట్ల‌ను తీసుకొచ్చే ప్ర‌భుత్వం.. కొత్త ఇబ్బందుల మీద కూడా దృష్టి పెట్టాల‌న్న చిన్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌టం ఏమిటి?