Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో మాల్స్‌..మ‌ల్టీఫ్లెక్సుల్లో పార్కింగ్ ఫ్రీ..!

By:  Tupaki Desk   |   21 March 2018 5:42 AM GMT
తెలంగాణ‌లో మాల్స్‌..మ‌ల్టీఫ్లెక్సుల్లో పార్కింగ్ ఫ్రీ..!
X
మీరు మాల్స్ కు వెళుతుంటారా? మ‌ల్టీఫ్లెక్సుల్లో సినిమాలు చూస్తుంటారా? అయితే.. మీకీ వార్త క‌చ్ఛితంగా స్వీట్ న్యూసే. మాల్స్.. మ‌ల్టీఫ్లెక్సుల‌కు వెళ్లే వారంద‌రికి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు వ‌సూలు చేసే పార్కింగ్ లాట్ ఛార్జీలు షాకుల మీద షాకులు ఇస్తూ ఉంటాయి. గంట‌ల చొప్పున వ‌సూలు చేసే ఈ ఛార్జీల బాదుడు కొన్నేళ్లుగా సాగుతోంది.

పార్కింగ్ ఛార్జీల వ‌సూలు చ‌ట్ట‌విరుద్ధమే అయినా.. అందుకు సంబంధించిన రూల్స్ ప‌క్కాగా లేక‌పోవ‌టంతో అధికారులు సైతం ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి.

ఇలాంటి వేళ తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు తాజాగా ఒక జీవోను జారీ చేసింది. పుర‌పాల‌క శాఖ జారీ చేసిన జీవో నెంబ‌రు187 ప్ర‌కారం ఏప్రిల్ ఒక‌టి నుంచి మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్సుల్లో ఉచిత‌ పార్కింగ్ సౌక‌ర్యాన్ని క‌ల్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఇందుకు సంబంధించిన కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి.

ఏదో స‌ర‌దా కోస‌మో.. టైం పాస్ కోస‌మో మాల్స్ కు వెళితే పార్కింగ్ ఛార్జీలు క‌ట్టాల్సిందే. అదే స‌మ‌యంలో ఏదైనా కొనుగోలు చేయ‌టానికి... సినిమా చూసేందుకు వెళితే మాత్రం వారికి పార్కింగ్ మొత్తాన్ని చెల్లించాల్సి అవ‌స‌రం ఉండ‌దు. తాజా జీవో ప్ర‌కారం రూల్స్ ను అమ‌లు చేయ‌ని మాల్స్.. మ‌ల్టీఫ్లెక్సుల‌పై జీహెచ్ ఎంసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంది.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ తో పాటు.. తెలంగాణ‌లోని ఇత‌ర ప‌ట్ట‌ణాల్లోని మాల్స్‌.. మ‌ల్టీఫ్లెక్సుల్లో ఈ రూల్స్ వ‌ర్తిస్తాయి. ఇక‌.. రూల్స్ ఏమిటంటే..

+ 30 నిమిషాల్లోపు పార్కింగ్‌ కు ఎలాంటి రుసుము వ‌సూలు చేయ‌కూడ‌దు. వ‌స్తువులు కొన్నా కొన‌కున్నా!

+ 30 నిమిషాల నుంచి గంట వ‌ర‌కు మాల్స్ లో ఏదైనా షాపింగ్ చేస్తే ర‌శీదు చూపిస్తే పార్కింగ్ ఫ్రీ.

+ గంట కంటే ఎక్కువ టైం పార్కింగ్ చేస్తే.. పార్కింగ్ రుసుము కంటే ఎక్కువ మొత్తంలో బిల్లు అమౌంట్ కానీ.. సినిమా టికెట్ కానీ చూపిస్తే.. వారి నుంచి పార్కింగ్ ఫీజు వ‌సూలు చేయ‌రు.